● ఐచర్‌ వ్యాన్‌ను ఢీకొట్టిన బైక్‌ ● ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు ● ఒకరి పరిస్థితి విషమం ● కొంప ముంచిన ట్రిపుల్‌ రైడింగ్‌ | - | Sakshi
Sakshi News home page

● ఐచర్‌ వ్యాన్‌ను ఢీకొట్టిన బైక్‌ ● ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు ● ఒకరి పరిస్థితి విషమం ● కొంప ముంచిన ట్రిపుల్‌ రైడింగ్‌

Jul 26 2026 8:06 AM | Updated on Jul 26 2026 8:06 AM

● ఐచర్‌ వ్యాన్‌ను ఢీకొట్టిన బైక్‌ ● ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు ● ఒకరి పరిస్థితి విషమం ● కొంప ముంచిన ట్రిపుల్‌ రైడింగ్‌ ప్రమాదం పంపిన హెచ్చరికలు

బాధ భరించలేకపోతున్నాను..

శ్రీకాకుళం క్రైమ్‌ : జిల్లా కేంద్రంలోని ఏడు రోడ్ల కూడలి సమీప నాగావళి పాత వంతెనపై శనివారం వేకువజామున 4 గంటలకు స్పోర్ట్స్‌ బైక్‌పై వస్తున్న ముగ్గురు యువకులు ఎదురుగా వస్తున్న కాయగూరల వ్యాన్‌ను ఢీకొన్నారు. ఘటనలో దమ్మలవీధి సమీప రెల్లివీధికి చెందిన మాడుగుల సుభాష్‌(24) అక్కడికక్కడే మృతి చెందారు. సుభాష్‌ చిన్నాన్న కుమారుడైన మాడుగుల జై అభిఘ్న్‌ (25) తలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరితో పాటు విశాఖకు చెందిన దనాల సిద్ధూప్రశాంత్‌ చేయి విరిగింది. వివరాల్లోకి వెళితే..

నగరంలోని దమ్మల, రెల్లి వీధివాసులైన మాడుగుల చంద్రశేఖర్‌ కుటుంబ సభ్యులతో విశాఖలోని గొల్లలపాలెంలో ఉంటున్నారు. చంద్రశేఖర్‌ బెహ్రా ఇండస్ట్రీలో చేపల వ్యాపారం చేస్తున్నారు. అప్పులు తీర్చడానికి ఇక్కడ ఇంటిని అమ్మేసి విశాఖ వెళ్లిపోయారు. చంద్రశేఖర్‌ కుమారుడు సుభాష్‌ మూడు నెలల కిందట సీమెన్‌ ట్రైనింగ్‌ పూర్తి చేసుకున్నాడు. మరో వారంలో షిప్‌ ఎక్కబోతున్నాడు. చంద్రశేఖర్‌ తమ్ముడు రమేష్‌కుమార్‌, సుమతీ దంపతుల ఇద్దరు కుమారుల్లో ఒకరైన మాడుగుల జై అభిఘ్న్‌ సైతం ఉత్తరాఖండ్‌లో ట్రిపుల్‌ ఐటీలో చదివి ఉద్యో గ ప్రయత్నాల్లో ఉన్నాడు. వీరూ విశాఖలోనే ఉంటున్నారు. పండగల కోసమని ఈ నెల 24న వీరు శ్రీకాకుళం వచ్చారు. వీరితో పాటు విశాఖకు చెందిన సిద్ధ్దూ కూడా వచ్చాడు.

శనివారం తెల్లవారుజామున వాకింగ్‌కు వెళ్తామని తండ్రితో చెప్పిన సుభాష్‌ తన కేటీఎం డ్యూక్‌ బైక్‌పై అభిఘ్న, సిద్ధులతో కలసి 3.50 గంటలకు బయల్దేరాడు. అక్కడకు 10 నిమిషాల్లోనే పాత వంతెనపై ప్రమాదం జరిగిందని ఫోన్‌ రావడంతో కుటుంబ సభ్యులు నిశ్చేష్టులయ్యారు. అప్పటికే కుమారుడు సుభాష్‌ ప్రమాద స్థలిలోనే దుర్మరణం చెందడం, అక్కడికి కొద్ది దూరంలో తలకు గాయాలై అపస్మారక స్థితిలో అభిఘ్న ఉండటం, చేయి విరిగిన సిద్ధుప్రశాంత్‌ చుట్టూ స్థానికులు చేరడం.. రిమ్స్‌కు తరలించడం జరిగింది. నాగావళి పాత వంతెనపై శనివారం వేకువజామున 4 గంటలకు వీరి బైక్‌ ఎదురుగా వస్తున్న కూరగాయల వ్యాన్‌ను ఢీకొట్టింది. ఢీకొట్టాక దాదాపు 30 అడుగుల దూరంలో బైక్‌పై నుంచి తుళ్లిపోయినట్లు ట్రాఫిక్‌ పోలీసులు చెప్పారు. ప్రమాద స్థలిలోనే మృతి చెందిన సుభాష్‌ మృతదేహాన్ని రిమ్స్‌కు తీసుకెళ్లారు. జై అభిఘ్నను కుటుంబ సభ్యుల సూచనల మేరకు విశాఖలోని సెవెన్‌ హిల్స్‌కు, సిద్ధు ప్రశాంత్‌ను కేజీహెచ్‌కు తరలించినట్లు సీఐ రామారావు చెప్పారు. కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

●జిల్లా కేంద్రంలోని డేఅండ్‌ నైట్‌, ఏడురోడ్లు, సూర్యమహల్‌, ఉమెన్స్‌ కాలేజీ, జిల్లాపరిషత్‌, 80 ఫీట్‌రోడ్డు, రామలక్ష్మణ, ఇలిసిపురంలో రాత్రి 12 గంటల తర్వాత బీట్‌ వ్యవస్థ ఉనికిపై అనుమానాలు ఉన్నాయి.

●స్పోర్ట్స్‌ బైకుల ప్రమాదాలు ఇటీవల తరచూ జరుగుతున్నాయి. మితిమీరిన వేగానికి ఈ బైకులూ కారణమే.

●దాబాలు, బార్లు, హొటళ్లలో విచ్చలవిడిగా ఎప్పుడు పడితే అప్పుడు మద్యం దొరుకుతుండడం ప్రమాదాలకు కారణమవుతోంది.

●పాత వంతెనపై రాత్రి సమయాల్లో వాహనాల పార్కింగ్‌ ప్రమాదకరంగా మారుతోంది.

నా కొడుకు చదువుకు, సీమెన్‌ శిక్షణకు రూ.15 లక్షలు ఖర్చు పెట్టాను. మరో వారంలో షిప్‌ ఎక్కాలి. ఇప్పుడిలా జరిగిపోయింది. నా తమ్ముడి కొడుకూ ప్రాణాపాయంలో ఉన్నాడు. వాడూ ట్రిపుల్‌ ఐటీ చదివాడు. కొడుకు కష్టాలు తీరుస్తాడని అనుకుంటే ఇలా జరిగింది. ఈ బాధ భరించలేకపోతున్నాను.

– చంద్రశేఖర్‌, మృతుడు సుభాష్‌ తండ్రి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement