అరసవల్లి: ప్రత్యక్ష దైవం అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారి కల్యాణ సేవ శనివారం ఘనంగా జరిగింది. ఆషాడ శుద్ధ ఏకాదశి (తొలి ఏకాదశి) పర్వదినం సందర్భంగా శ్రీ ఉషా పద్మిని ఛాయాదేవేరులతో శ్రీ వారి కల్యా ణ మూర్తులను అనివెట్టి మండపంలో ప్రత్యేక మండపంపై వేంచేసింపజేసి ఆగమశాస్త్రం ప్రకారం కల్యాణాన్ని నిర్వహించారు.
మందస: మందస మండలం కొండాలోగాం పంచాయతీలో చాపరాయి గ్రామం పరిధిలో 94 సర్వే నంబర్‌లో ఉన్న 34 ఎకరాల భూమిని చాలాకాలంగా గిరిజనులు సాగు చేస్తున్నారు. ఆ భూములను నాలుగు రోజుల నుంచి మందస తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది సర్వే చేస్తున్నారు. తమకు సమాచారం ఇవ్వకుండా సర్వే చేస్తుండడంపై గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ భూమినే నమ్మి బతుకుతున్నామని, భూములను పరిరక్షించాలని వారు కోరుతున్నారు. ఇలాంటివి భవిష్యత్‌లో పునరావృతం కాకుండా చూడాలని గిరిజన శక్తి సంక్షేమ సంఘం నాయకులు ఎస్.నరసింహరావు, కార్యదర్శి ఎస్.హరికృష్ణ, మానవహక్కుల వేదిక జిల్లా కార్యదర్శి ఎస్.నారాయణరావు, ఏపీ రైతు కూలీ సంఘం రాష్ట్ర కోశాధికారి కోనేరు రమేష్, బాలకృష్ణ, తులసిరావు, నందీశ్వరరావు, పాపారావు, గోవిందరావు, విశ్వనాథం, కళావతి, నాగేశ్వరావు, హేమలత తదితర రైతులు కోరారు.
శ్రీకాకుళం రూరల్: బొల్లినేని మెడిస్కిల్స్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని హెచ్‌పీసీఎల్ స్కిల్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ నేతృత్వంలో ఫ్రంట్‌లైన్ హెల్త్‌కేర్ గివింగ్ అసిస్టెంట్, వెల్నెస్ థెరపిస్ట్ కోర్సులో ఉచిత శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీహెచ్ నాగేశ్వరరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి పాసై 18 నుంచి 27 ఏళ్లలోపు యువతీ యువకులు అర్హులని పేర్కొన్నారు. శిక్షణ కాలంలో ఉచిత భోజన, వసతి సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఇంటర్ పాసైన విద్యార్థులకు డిప్లమో, బీఎస్సీ, ఎంఎల్‌టీ, బీపీటీ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయని, మరిన్ని వివరాలకు 7995013422, 7680945357 నంబర్లను సంప్రదించాలని కోరారు.


