శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా కేంద్రంలోని ఎల్‌బీఎస్ కాలనీలో నివాసం ఉంటున్న ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి, బిల్డర్ కట్టా వెంకటేశ్వరరావు(కట్టా బాబు) బుధవా రం రాత్రి లిఫ్ట్‌లో జారి పడి మరణించారు. ఎల్‌బీఎస్ కాలనీ ఫ్లాట్ నంబర్ 29లో రెండంతస్తుల సొంత నివాస గృహంలో భార్యతో కలసి కట్టాబాబు (66) నివసిస్తున్నారు. ఈయన నగరంలోని పలు హోటళ్లు సోదరుని సాయంతో నడుపుతుండటమే కాకుండా ఉత్తరాంధ్రలో లగ్జరీ అపార్ట్‌మెంట్లు, కమర్షియల్ ప్రాజెక్టులను నిర్మించి రియల్ ఎస్టేట్ రంగంలో తనదైన ముద్ర వేశారు. నగరంలోని కిన్నెర, కీర్తిక, కీర్తన థియేటర్లకు మేనేజర్‌గా వ్యవహరించారు.
ఆయన బుధవారం రాత్రి 6.43 గంటలకు భార్యకు బయటకు వెళ్తున్నానని.. కొద్దిసేపట్లో వచ్చేస్తానని చెప్పి ఇంటినుంచి బయల్దేరారు. అర్ధరాత్రి అయినా రాకపోవడంతో పని ప్రదేశంలో ఉండిపోయి ఉంటారని కుటుంబ సభ్యులు భావించా రు. గురువారం ఉదయం 6 గంటలకు శ్రీనివాస్ అనే కార్మికుడికి లిఫ్ట్ సమీపంలో కట్టాబాబు కాలు కనిపించడంతో నిశ్చేష్టుడయ్యాడు. గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు, కట్టాబాబు భార్య చేరుకున్నారు. అనంతరం కట్టాబాబు మృతదేహాన్ని లిఫ్ట్ షాఫ్ట్ నుంచి బయటకు తీశారు.
ఎలా జరిగిందంటే..
ఘటనాస్థలిలో సీసీ ఫుటేజీ పరిశీలించగా లిఫ్ట్‌వైపు కట్టాబాబు రావడం, ఆ ప్రదేశం చీకటి మయం కావడం, లిఫ్ట్ క్యాబిన్ రెండో అంతస్థుకు రాకముందే తలుపులు తెరుచుకున్నాయన్న భావనతో లోపలకు అడుగు పెట్టడంతో జారిపడి కింద అంతస్తులో ఉన్న లిఫ్ట్‌పై పడిపోయారు. సీసీ ఫుటేజీలో కట్టాబాబు కేకలు వేస్తున్నట్లు ఆడియో సైతం వినిపించింది. తలకు, ఎడమ చేతికి, ఎడమకాలికి తీవ్ర గాయాలై రక్తస్రావం కావడంతో పాటు అంతర్గత రక్తస్రావం జరిగి అక్కడికక్కడే మృతిచెందారు. ఘటనాస్థలికి ఒకటో పట్టణ ఎస్‌ఐ ఎం.హరికృష్ణ, సిబ్బంది వెళ్లారు. మృతుని కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ హరికృష్ణ పేర్కొన్నారు. కట్టా బాబు కుమారుడు నాగచైతన్యకు వివాహమై విశాఖపట్నంలో ఉద్యోగం చేస్తుండగా, కుమార్తెకు సైతం వివాహమై బెంగళూరులో కుటుంబంతో స్థిరపడ్డారు.


