భూ సమస్య పరిష్కరించాలి
శాఖల వారీగా వచ్చిన వినతులు
● కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
● పీజీఆర్‌ఎస్‌లో 180 వినతుల స్వీకరణ
శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రజా సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యమిస్తామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌లు తెలిపారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల నమోదు, పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)ను సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి స్వయంగా 180 వినతులను స్వీకరించారు. అయితే వినతులు ప్రతివారం వస్తున్నా.. పరిష్కారం మాత్రం కనిపించడం లేదు. ప్రతీ సమస్యకు ఒక ఎండార్సుమెంట్ జారీచేసి, అ సమస్య పరిష్కారం జరిగినట్టు చూపిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఫిర్యాదుదారుకి న్యాయం జరగడం లేదు. కార్యక్రమంలో డీఆర్వో వి.విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
అక్రమాలపై విచారణ జరపాలి
కంచిలి మండలంలోని భవానీ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భవానీ ఐటీఐలో జరుగుతున్న అక్రమాలపై విచారణ జరిపించాలని పలువురు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన ఫీజు కంటే రెట్టింపు వసూలు చేస్తూ.. విద్యార్థులకు ఉపకార వేతనాలను కూడా ఇవ్వడం లేదని తెలిపారు. ప్రాక్టికల్స్ కూడా నిర్వహించడం లేదని, మాస్ కాపీయింగ్ కోసం, హాజరు సర్దుబాటు కోసం, రికార్డుల మేనేజ్‌మెంట్ కోసం వివిధ రకాల ఫీజులు కూడా వసూలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఫిర్యాదు చేసినవారిలో ఈశ్వరరావు, సత్యం నాయుడు, శ్రీకాంత్, ఎన్.బాబురావు, జి.రాంబాబులు ఉన్నారు.
ఉద్యోగుల సమస్యల పరిష్కరించాలి
ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగుల ఎన్జీవో సంఘం జిల్లా అధ్యక్షుడు హనుమంతు సాయిరాంతో కలిసి పలువురు ఉద్యోగులు వినతిపత్రం అందజేశారు. ఉద్యోగి అనారోగ్యం బారినపడినప్పుడు ఆర్టీసీ డాక్టరు గానీ, ప్రభుత్వ డాక్టరు గానీ ఇచ్చిన సిక్ సర్టిఫికెట్ ఆధారంగా ఉద్యోగి లీవ్ అకౌంట్లో తగినన్ని లీవ్ బ్యాలన్స్ ఉన్నప్పటికీ పూర్తి జీతం ఇవ్వాలని కోరారు. సీ్త్ర శక్తి పథకంలో ఓవర్ లోడ్ ఉన్నప్పటికీ తనిఖీ అధికారులు కేసులు రాయడంతో ఉద్యోగి పూర్తిస్థాయిలో విధులు నిర్వర్తించలేకపోతున్నారని తెలిపారు. జిల్లాలో డిపో మేనేజర్లు, కేంద్ర కార్యాలయం సర్కులర్‌కు విరుద్ధంగా క్యుములేటివ్ ఇంక్రిమెంట్లు కోత విధిస్తున్నారని వాటిని ఆపాలన్నారు.
రణస్థలం మండలం జీరుపాలెం గ్రామ పంచాయతీ పరిధి జగన్నాథపురం గ్రామ ప్రభుత్వ భూమి సమస్యపై ఉన్నత స్థాయి విచారణ జరిపి అర్హులైన పేదలకు న్యాయం చేయాలని గ్రామస్తులు పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు. కోటిపాలెం గ్రామ సరిహద్దులో ఉన్న ప్రభుత్వ భూమిని గతంలో భూమిలేని పేద కుటుంబాలకు ఇళ్ల స్థలాలు, గ్రామాభివృద్ధి అవసరాల కోసం కేటాయించారని తెలిపారు. అయితే ప్రస్తుతం ఆ భూమిలో కొంతభాగం కొద్దిమంది వ్యక్తుల ఆధీనంలో ఉందని, గ్రామంలోని అనేక మంది భూమిలేని పేద కుటుంబాలకు ఇప్పటికీ ఇళ్ల స్థలాలు లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై ఇదివరకే అధికారులకు కలిసినా పరిష్కారం కాలేదని వాపోయారు. ఇప్పటికై నా అధికారులు ప్రభుత్వ భూమి సమస్యపై ఉన్నతస్థాయి విచారణ చేపట్టి, న్యాయం చేయాలని కోరారు.
రెవెన్యూ (సీసీఎల్‌ఏ) 66 వినతులు
పంచాయతీ రాజ్ శాఖ 22
సెర్ప్ విభాగం 15
వ్యవసాయ శాఖ 13
మున్సిపల్ పరిపాలన 11
సర్వే సెటిల్‌మెంట్స్ విభాగం 10
ఈపీడీసీఎల్ (విద్యుత్) 9
రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ 4
పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ విభాగం 4
పోలీస్ శాఖ 3
సచివాలయ విభాగం 3
మెడికల్ ఎడ్యూకేషన్ 3
రూరల్ డవలెప్‌మెంట్ 2
వాటర్ రిసోర్సు 2
బీసీ వెల్ఫేర్, ఏపీఎస్ ఆర్టీసీ, ఐసీడీఎస్, సెకండరీ హెల్త్, సమగ్ర శిక్ష, ఎండోమెంట్, ఫ్యాక్టరీస్, రూరల్ వాటర్ సప్లయ్, బోర్డు ఆప్ ఇంటర్మీడియట్, సివిల్ సప్లయ్, ఏపీ పొల్యూషన్ బోర్టు, ఎంప్లాయీమెంట్ అండ్ ట్రైనింగ్, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ శాఖలకు ఒక్కక్కటి వంతునా ఫిర్యాదులు వచ్చాయి.


