● కారు ఢీకొని వ్యక్తి మృతి
రణస్థలం: కారు డ్రైవర్ నిర్లక్యం, అతివేగానికి ఒక నిండు ప్రాణం బలయ్యింది. మండలంలోని నెలివాడ సమీపంలో జాతీయ రహదారిపై శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. దీంతో బైకుపై ఉన్న ఈల్ల శ్రావణ్(33) అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సోమవారం ఉదయం రణస్థలం మండల కేంద్రంలోని ఒక ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయినిగా పనిచేస్తున్న తన భార్య కోమలిని మృతుడు శ్రావణ్ 8 గంటల సమయంలో పాఠశాల వద్ద దించి తిరిగి ఇంటికి బయల్దేరాడు. అతడిని నెలివాడ పైవంతెన దిగువున ఉదయం 8.25 గంటల సమయంలో వెనుక నుంచి కారు అతివేగంగా వచ్చి ఢీకొంది. దీంతో ద్విచక్ర వాహనం 50 మీటర్లు దూరంలో ఎగిరిపడింది. తీవ్రగాయాలు కావడంతో ప్రమాదస్థలంలోనే శ్రావణ్ మృతి చెందాడు. కారు ఒడిశా రాష్ట్రంలోని బరంపురం నుంచి వస్తోందని పోలీసులు తెలిపారు. మృతుడి స్వగ్రామం విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలోని గునపురెడ్డిపేట. ఇతను పైడి భీమవరంలోని డాక్టర్ రెడ్డీస్‌లో కెమిస్ట్రీగా పని చేస్తున్నాడు. అలాగే కారు నడుపుతున్న వ్యక్తి సైతం అదే కంపెనీలో పని చేస్తున్నాడు. మృతుడికి భార్య కోమలి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ ప్రమాదంతో గునపరెడ్డిపేట గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. జేఆర్‌పురం ఎస్‌ఐ ఎస్.చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాడు.


