మందస: ఉద్దాన ప్రాంతంలో విమానాశ్రయ నిర్మాణానికి కేంద్రం సిద్ధంగా ఉందని, స్థానికులు సహకరించాలని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. మందస మండలం బిడిమి గ్రామంలో శనివారం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాధిత రైతులంతా తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ కొబ్బరి, జీడి, పనస, అరటి, మున గ, మామిడి పంటలు అధిక సంఖ్యలో పండుతున్నాయని, అలాంటి భూములను ఎయిర్‌పోర్టు నిర్మాణానికి ఇచ్చేదే లేదని తేల్చి చెప్పారు. ఈ మేరకు బాధిత గ్రామస్తులంతా కలిసి కేంద్ర మంత్రికి వినతి పత్రం కూడా అందజేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా సీపీఐఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావును తన ఇంటి వద్దనే పోలీసులు నిర్బంధించారు. ఎయిర్‌పోర్టు వ్యతిరేక కమిటీ నాయకుడు బత్తిన లక్ష్మణరావును ఆదివారం ఉద యం అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వామపక్ష పార్టీ నాయకులు వంకల మాధవరావు, తామాడ సన్యాసిరావు, చాపర వెంకటరమణ, ఎన్.గణపతి తదితరుల ఇళ్ల వద్దకు వెళ్లి ఎయిర్‌పోర్టు గ్రామాలకు వెళ్లరాదని హెచ్చరించారు.


