‘ఉపా’ కేసును ఉపసంహరించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

‘ఉపా’ కేసును ఉపసంహరించుకోవాలి

Jul 12 2026 3:35 AM | Updated on Jul 12 2026 3:35 AM

శ్రీకాకుళం (పీఎన్‌ కాలనీ): యూట్యూబర్‌ ‘ప్రశ్న రావణ్‌’పై ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు ‘ఉపా’ చట్టం కింద నమోదు చేసిన కేసును తక్షణమే బేషరతుగా ఉపసంహరించుకోవాలని ఉపాధ్యాయ, విద్యార్థి, దళిత, ఆదివాసీ, ప్రజా సంఘాల ఐక్యవేదిక ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. శ్రీకాకుళం నగరంలో ఇలిసిపురం అంబేడ్కర్‌ విజ్ఞాన మందిర్‌లో ఐక్యవేదిక ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ, పోలీసుల వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐక్యవేదిక జిల్లా కన్వీనర్‌ పేడాడ కృష్ణారావు మాట్లాడుతూ ఉపా చట్టం పౌరుల ప్రాథమిక హక్కులను కాలరాసే ఒక నల్ల చట్టమని, దీన్ని ప్రజాస్వామ్యంలో ఎవరిపైనా ప్రయోగించడం సరైంది కాదన్నారు. మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కె.వి.జగన్నాధరావు మాట్లాడుతూ నేరం చేయని వారిపై కూడా ఈ దారుణమైన చట్టాన్ని మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టంలోని లొసుగుల వల్ల చేయని నేరానికి ఏళ్ల తరబడి జైల్లో మగ్గాల్సి వస్తోందని చెప్పారు.

ప్రశ్న రావణ్‌పై పెట్టిన కేసు భవిష్యత్తులో ప్రశ్నించే గొంతులను భయపెట్టడానికి, సామాజిక మాధ్యమాలను అదుపు చేయడానికి ప్రభుత్వం వేసిన కుట్రగా ఆయన అభివర్ణించారు. సమావేశంలో పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పత్రి దానేష్‌, జిల్లా దళిత జేఏసీ కన్వీనర్‌ డి.గణేష్‌, కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు మిస్క కృష్ణయ్య, జిల్లా అధ్యక్షుడు బెలమర ప్రభాకర్‌, పీడీఎం రాష్ట్ర అధ్యక్షుడు జె.వెంకటరావు, డి.టి.ఎఫ్‌. పూర్వ జిల్లా అధ్యక్షుడు కోత ధర్మారావు, ఆదివాసీ సంక్షేమ సంఘం ప్రతినిధి శాంతారావు, బీటీఏ నాయకుడు శ్రీనివాసరావు, జె.వి.వి. చిన్నారావు, రెల్లి సంక్షేమ సంఘం నేత అర్జి కోటి, రైతు కూలీ సంఘం నాయకుడు బి.కూర్మారావు, బుడుమూరు వెంకటరమణ, అంబేడ్కర్‌ చైర్‌ సాధన సమితి జిల్లా కన్వీనర్‌ టి.రమణ, పైడి కుల సంక్షేమ సంఘం జిల్లా నాయకులు నిమ్మల అనంతరావు, రాకోటి చిన్నికృష్ణ, సత్యం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement