70 ఏళ్ల వయసు.. సేద్యంపై ఆధారపడిన బతుకు. ఇంటి పనులు, పొలం పనులతో నిత్యం సందడిగా ఉండే జీవితం. కష్టపడి పనిచేసే ప్రాణం. బస్తా ఎరువు కోసం చేసిన నిరీక్షణ ఆమె ప్రాణం తీసింది. నందిగాం మండలంలో ని పెద్దలవునిపల్లి గ్రామానికి చెందిన పినకాన కాంతమ్మ(70) శుక్రవారం యూరియా కోసం రైతు సేవా కేంద్రానికి వెళ్లి అక్కడే ప్రాణాలు వదిలేశారు. పెద్దలవుని పల్లి రైతు సేవా కేంద్రంలో ఎరువులు పంపిణీ చేశారు. కొత్త నిబంధన ప్రకారం యూరియా పంపిణీ చేసేందుకు భూమి ఉన్న ప్రతి రైతు ఆర్‌ఎస్‌కేకు తప్పనిసరిగా రావాల్సి ఉంటుంది. దీంతో కాంతమ్మ తన కుమార్తెతో కలిసి ఆర్‌ఎస్‌కేకు వెళ్లారు. అంత చిన్న గదిలో స్లిప్పులు రాయించుకోవడం, బయోమెట్రిక్ వేయడం, ఎరువు కోసం వేచి ఉండడంతో గాలి ఆడని స్థితి. ఎలాగోలా అవన్నీ చేయించుకున్న కాంతమ్మ బయటకు వచ్చిన కాసేపటికే కుప్పకూలిపోయారు. టెక్కలి జిల్లా కేంద్రాస్పత్రికి తరలించే లోగానే ఆమె మృతి చెందారు. – నందిగాం


