● క్వారీల్లో వరుస ప్రమాదాలు
● భద్రతా చర్యలు ప్రశ్నార్థకం
టెక్కలి: కూలి పనుల కోసం వెళ్తున్న వారి బతుకులు అర్ధంతరంగా కూలిపోతున్నాయి. యజమానుల లాభాపేక్ష, యంత్రాంగం నిర్లక్ష్యం కలగలిపి బడుగు జీవుల ప్రాణాలు తీస్తున్నాయి. టెక్కలి మైన్స్ కార్యాలయం పరిధిలో ఉన్న గ్రానైట్ క్వారీల్లో ఇటీవల కాలంలో తరచూ ప్రమాదాలు సంభవిస్తూ కార్మికులు మృత్యువాత పడుతున్నారు. ప్రమాదాలు జరిగినపుడు మాత్రమే అధికారుల హడావుడి చేస్తున్నారు తప్ప భద్రతా ప్రమాణాలపై ఎలాంటి చర్య లు తీసుకోవడం లేదు. మెళియాపుట్టి మండలం గంగరాజపురంలో ముగ్గురు, దబ్బగూడలో మరో ము గ్గురు, టెక్కలిలో ఇద్దరు, తాజాగా కోటబొమ్మాళి మండలం దుప్పలపాడు సమీపంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.
ఇవి పాటించాల్సిందే..
● గ్రానైట్ క్వారీ నిర్వహణలో ముఖ్యంగా హెల్మెట్లు, సేఫ్టీ షూస్, గ్లోవ్స్, సేఫ్టీ గాగుల్స్ లాంటి వ్యక్తిగత రక్షణ పరికరాలు అందించడం తప్పనిసరి.
● భద్రతా సిగ్నల్స్, హెచ్చరికలతో సరైన హెచ్చరిక వ్యవస్థ ఏర్పాటు చేయాలి.
● సురక్షిత విధానాలు (సేఫ్టీ ప్రొటోకాల్) పాటించడం వాటిపై కార్మికులకు శిక్షణ ఇచ్చి అవగాహన కల్పించడం, మిషన్ల తగిన రక్షణ కవచాలు (గార్డింగ్స్) ఏర్పాటు చేసి, సరైన నిర్వహణ జరపాలి.
● ప్రమాదాలతో కూడిన ప్రమాద నిరోధక బోర్డులను ఏర్పాటు చేసి విపత్తుల నిర్వహణపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలి.
● ముఖ్యంగా మైన్స్ మేనేజర్ పర్యవేక్షణ ఉండాలి.
● బ్లాస్టింగ్ అనుమతులు కలిగిన క్వారీల్లో పోలీసులు తరచూ తనిఖీలు చేయాలి.
● మన గ్రానైట్ క్వారీల్లో భద్రతా చర్యలు సరైన విధంగా లేకపోవడం వలన తరచూ ప్రమాదాలు, మరణాలు సంభవిస్తున్నాయి.
● గ్రానైట్ క్వారీల్లో భద్రతా వారోత్సవాలు కూడా కానరావడం లేదు.


