● అరసవల్లిలో ఏరో సెక్యూరిటీ సర్వీసెస్ టెండర్ కాంట్రాక్ట్‌ను రద్దు చేసిన ఈఓ ● స్వీపర్‌పై కాంట్రాక్టర్ లైంగిక ఆరోపణల నేపథ్యంలో చర్యలు
అరసవల్లి: ‘జీతం కావాలా.. అయితే నా ఇంటికి రా..’’ అంటూ స్వీపర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన ఏరో సెక్యూరిటీ సర్వీసెస్ పారిశుద్ధ్య నిర్వహణ కాంట్రాక్టర్ గోవింద్‌పై ఎట్టకేలకు ఆలయ ఈవో కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్ చర్యలకు ఉపక్రమించారు. గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం సంచలనం రేకెత్తించిన సంగతి విదితమే. పారిశుద్ధ్య విభాగంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న ఓ యువతి పట్ల కాంట్రాక్టర్ గోవింద్ అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు చేరడంతో ఈ విషయంలో అధికారులు సీరియస్‌గా వ్యవహరించారు. జిల్లా ఉన్నతాధికారులతో పాటు దేవదాయ శాఖ ఉన్నతాధికారులు కూడా తీవ్రంగా స్పందించడంతో టెండర్‌దారుడైన గోవింద్‌కు ఆ కాంట్రాక్ట్‌ను రద్దు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాజకీయ నేతల ఒత్తిళ్లు పెద్ద ఎత్తున వచ్చినప్పటికీ.. స్థానిక పరిస్థితులతో పాటు పారిశుద్ధ్య కార్మికుల్లో ఐక్యతతో ఈ కాంట్రాక్ట్‌ను రద్దు చేసేలా అధికారులు అడుగులు వేశారని తెలుస్తోంది. కాంట్రాక్టర్‌కు మద్దతుగా అధికార పార్టీ నేతలు కొందరు పోలీసుల సమక్షంలోనే బాధితురాలితో పాటు జీతాల కోసం ఎదురు చూస్తున్న మిగిలిన సిబ్బందికి, కాంట్రాక్టర్‌కి మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేసినప్పటికీ ‘సాక్షి’లో ఈ వ్యవహారం కూడా ప్రచురించడంతో చేసేదేమీ లేక చర్యలకు దిగినట్లుగా సమాచారం.


