శ్రీకాకుళం/ గార: గార కేజీబీవీలో డయేరియా ప్రబలడానికి అక్కడి సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని ప్రాథమిక విచారణలో అధికారులు గుర్తించారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు గురువారం రాత్రి సమగ్ర శిక్ష ఏపీసీ వేణుగోపాలరావు కేజీబీవీకి వెళ్లి విచారణ చేయగా శుక్రవారం మధ్యాహ్నం డీఈఓ రవిబాబు మరోసారి విచారణ చేశారు. కూరలను పూర్తిస్థాయిలో ఉడికించకపోవడం వల్ల డయేరియా ప్రబలినట్లు అధికారులు చెబుతున్నారు. విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు చెబుతున్న ప్రకారం విద్యార్థినులకు ఇచ్చిన చిక్కీలు రాగిమాల్ట్ పాడైపోవడం వల్ల వ్యాధి బారిన పడినట్లు తెలుస్తోంది. పదో తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థులకు గార కేజీబీవీలో ప్రత్యేక తరగతులు నిర్వహించిన సందర్భంలో సరఫరా చేసిన చిక్కీలు, రాగి మాల్ట్‌లను విద్యార్థులకు ఇచ్చినట్లు సమాచారం. వాసన వస్తోందని విద్యార్థులు చెప్పినా.. వారిని గదమాయించి తాగించినట్లు సమాచారం. సంఘటన జరిగిన వెంటనే జిల్లా స్థాయికి సమాచారాన్ని ఇవ్వకపోవడాన్ని రాష్ట్ర అధికారులు సీరియస్ గా తీసుకున్నట్లు భోగట్టా. మరోవైపు గార పీహెచ్‌సీ ఆధ్వర్యంలో పాఠశాలలోనే వైద్య శిబిరం ఏర్పాటు చేసి బాధిత విద్యార్థినులకు చికిత్స అందిస్తున్నారు. కాగా, పూర్తి వివరాలు తెలుసుకునేందుకు సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తామని ఏపీసీ చెప్పారు.


