రణస్థలం: పేదల కోసం కేటాయించిన భూములను పేదలకే అప్పగించాలని, పెద్దల పేరుతో రాయించుకున్న వాటిని తక్షణమే రద్దు చేయాలని సుమారు 200 మంది జీరుపాలెం గ్రామస్తులు తహసీల్దార్, ఎస్సైల ఎదుట డిమాండ్ చేశారు. వారం రోజులుగా జీరుపాలెం పంచాయతీ జగన్నాథపురంలో గ్రామపెద్దలకు, గ్రామస్తులకు మధ్య తలెత్తిన వివాదం తీవ్ర రూపం దాల్చింది. 13 మంది గ్రామపెద్దలు వారి కుటుంబ సభ్యుల పేరుతో 271, 272, 273 సర్వే నంబర్లలో రాయించుకున్న సుమారు 20 ఎకరాల భూమిని రద్దు చేసి పేదలకు అందజేయాలని మహిళలు, యువత, గ్రామస్తులు గురువారం నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ సనపల కిరణ్‌కుమార్ మాట్లాడుతూ భారీగా గ్రామస్తుల చేరుకుని నినాదాలు చేస్తే గందరగోళం జరగడం తప్ప సమస్యకు పరిష్కారం జరగదన్నారు. ఇరుపక్షాలతో సమావేశం నిర్వహించి తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎస్సై ఎస్. చిరంజీవి మాట్లాడుతూ గ్రామం మొత్తం తరలివస్తే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని, ఇరుపక్షాలు ఈ భూమిపైకి రాకుండా చూస్తామని, కొన్ని రోజులు శాంతియుతంగా ఉంటే సమస్య పరిష్కరించే చొరవ తీసుకుంటామని హామీఇచ్చారు.


