శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): రాష్ట్రవ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కారం కోరుతూ ఈ నెల 13న కలెక్టరేట్ వద్ద మహాధర్నా నిర్వహిస్తున్నట్లు ఏఐఎస్‌ఎఫ్ నాయకులు తెలిపారు. ఈ మేరకు గురువారం జిల్లా కేంద్రంలోని క్రాంతి భవన్‌లో ఏఐఎస్‌ఎఫ్ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి.సోమశేఖర్, సీహెచ్ రవి మాట్లాడుతూ పెండింగ్ బకాయిలు తక్షణమే విడుదల చేస్తామని చెప్పి రెండేళ్లవుతున్నా కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు పట్టించుకోకపోవడం తగదన్నారు. డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ చదువుకున్న విద్యార్థులకు దాదాపు రూ.10వేల 700 కోట్ల బకాయిలున్నాయని చెప్పారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేస్తామని ప్రతి అసెంబ్లీ సమావేశాల్లో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటిస్తున్నారే తప్ప విద్యార్థుల ఖాతాల్లో ఒక్క రూపాయి కూడా జమ కావడం లేదన్నారు. రెండేళ్లుగా రూ 2,200 కోట్ల స్కాలర్‌షిప్ బకాయిలు కూడా చెల్లించలేదన్నారు. వసతి దీవెన పథకం ద్వారా వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, ఇంజినీరింగ్, మెడిసిన్, డిగ్రీ విద్యార్థులకు రూ.20 వేలు చెల్లించేవారని గుర్తు చేశారు. తక్షణమే తల్లికి వందనం, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, స్కాలర్‌షిప్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న వార్డెన్, కమాటీ పోస్టులు భర్తీ చేయాలని కోరారు. సమావేశంలో సంఘ నాయకులు అశోక్, హర్షవర్ధన్, ఉదయ్, సాయి, భవాని తదితరులు పాల్గొన్నారు.


