శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా మోడ్రన్ పెంటాథ్లెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మోడ్రన్ ఫెంటాథ్లెన్ లేజర్ రన్ ఎంపిక పోటీలు గురువారం జరగనున్నాయని ఆ సంఘ ప్రధాన కార్యదర్శి పీవీజే కృష్ణంరాజు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల వర్షం కారణంగా పోటీలను వాయిదా వేసిన విషయాన్ని గుర్తు చేశారు. రాజాంలోని జీసీఎస్‌ఆర్ డిగ్రీ కళాశాల వేదికగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాస్థాయి ఎంపికలు ఉదయం 9 గంటలకు మొదలవుతాయని పేర్కొన్నారు. బాలబాలికలు తమ జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డుతో ఎంపికలకు హాజరవ్వాలని సూచించారు.
తప్పిన పెను ప్రమాదం
పొందూరు: మండలంలోని వావిలపల్లిపేట కూడలి వద్ద మంగళవారం పెను ప్రమాదం తప్పింది. రాజాం వైపు నుంచి చిలకపాలెం వైపు వెళ్తున్న ఊకలారీ కూడలి వద్ద రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. కూడలి చిన్నది కావడంతో భారీ లారీ మలుపును దాటుతున్న సమయంలో అదుపుతప్పి తొలుత ఒరిగి నెమ్మదిగా రోడ్డుపై పడిపోయింది. ఆ సమయంలో రెండు వైపులా ప్రయాణిస్తున్న వాహనదారులు గమనించి, వారి వాహనాలను నెమ్మదిగా చేయడంతో ప్రమాదం బారిన పడకుండా తప్పించుకున్నారు. ఘటనలో లారీలో ఉన్న డైవర్, క్లీనర్‌కు ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఊక లారీ రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో కిలోమీటరు కంటే ఎక్కువగా వాహనాలు నిలిచిపోయాయి. కళాశాల బస్సులు, స్కూలు బస్సులు, అంబులెన్సులు, ఆర్టీసీ బస్సులు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు ట్రాఫిక్‌లో చిక్కుకున్నాయి. సుమారు గంట సమయం పాటు వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. పొందూరు ఎస్‌ఐ సత్యనారాయణ రెండు క్రేన్‌లు తెప్పించి లారీని పక్కకు తీయించారు. దీంతో ట్రాఫిక్ క్లియర్ అయ్యింది.
విషం తాగి ఆత్మహత్యాయత్నం
అడ్డగుట్ట: రైలులో ప్రయాణిస్తున్న ఇద్దరు విషం తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడిన ఘటన సికింద్రాబాద్ జీఆర్పీ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. జీఆర్పీ ఇన్‌స్పెక్టర్ సాయి ఈశ్వర్‌గౌడ్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా చాపర గ్రామానికి చెందిన శ్రీరామ్ శిరీష్‌కుమార్‌కు సులోచనతో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు సంతానం. రెండు నెలలుగా శ్రీరామ్ సతీష్ తన గ్రామానికి చెందిన ఒక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. గత నెలలో వీరిద్దరూ కలిసి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా తమిళనాడులోని కోయింబత్తూర్‌కు వెళ్లిపోయారు. ఈ క్రమంలో తన భర్త ఆచూకీ తెలుసుకున్న సులోచన కోయింబత్తూర్‌కు వెళ్లి సతీష్, మరో మహిళను పట్టుకుంది. వారితో మాట్లాడి ముగ్గురూ కలిసి కోయింబత్తూర్ నుంచి సికింద్రాబాద్‌కు శబరి ఎక్స్‌ప్రెస్‌లోని జనరల్ కోచ్‌లో బయల్దేరారు. మంగళవారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు రైలు చేరుకుంటున్న సమయంలో సతీష్, అతనితో ఉన్న మహిళ విషం తాగి అపస్మారకస్థితిలోకి వెళ్లారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు వెంటనే అప్రమత్తమై ఇద్దరిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 396ను వెంటనే రద్దు చేసి, పాత రిజిస్ట్రేషన్ విధానాన్నే కొనసాగించాలని దస్తావేజు లేఖరులు, స్టాంప్ వెండర్లు, డీటీపీ ఆపరేటర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం శ్రీకాకుళంలోని జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పెన్‌డౌన్ నిర్వహించి నిరసన తెలిపారు. జీవో 396 అమలుతో రిజిస్ట్రేషన్ సేవల ప్రైవేటీకరణకు మార్గం సుగమమవుతుందని, దీంతో దస్తావేజు లేఖరులు, స్టాంప్ వెండర్లు, సహాయకులు, డీటీపీ ఆపరేటర్ల ఉపాధి దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. పాత విధానాన్ని కొనసాగిస్తూ లైసెన్సులు మంజూరు చేయాలని, సంక్షేమ పథకాలు అమలు చేసి సంప్రదాయ వృత్తులను పరిరక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. తమ డిమాండ్లు నెరవేరేవరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో డాక్యుమెంట్ రైటర్లు పిన్నింటి శ్రీను, ఆవాల రాము, అన్నెపు సీతారాం, భువన మోహన్, బలగ చంటి, అల్లు రాజారావు, కుమారస్వామి, కామేశ్వరరావు, ఇప్పిలి శ్రీను, సంతోష్, పాత్రో తదితరులు పాల్గొన్నారు.


