కార్యకర్తలకు జమచేసే బిల్లుల్లో కక్కుర్తి
కార్యాలయానికి 10 శాతం
అందజేయాల్సిందే
సెక్టార్ల లీడర్లకు వసూళ్ల బాధ్యతలు
సారవకోట: మండల కేంద్రంలోని ఐసీడీఎస్ ప్రాజెక్టులో అంగన్‌వాడీ కార్యకర్తల నుంచి వసూళ్ల పర్వం కొనసాగుతోంది. ఈ ప్రాజెక్టు పరిధిలో సారవకోట, జలుమూరు మండలాల్లోని 193 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. 2024 డిసెంబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే ప్రీస్కూల్ పిల్లలకు భోజనాలు పెట్టేందుకు అంగన్‌వాడీ కార్యకర్తలు చేతిలో డబ్బులు ఖర్చు చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఆరు నెలలకో, ఏడాదికో ఒకసారి బిల్లులు మంజూరు చేస్తుంది. దీంతో ఆయా కార్యకర్తలు వాటిని తీసుకోవడం జరుగుతుంది.
ఇటీవల నిధులు జమ
ఇటీవల సారవకోట కార్యాలయం నుంచి అంగన్‌వాడీ కార్యకర్తలు ఖర్చుపెట్టిన సొమ్మును ప్రభుత్వ నిబంధనల మేరకు ఖాతాలకు జమ చేశారు. వాటితో పాటు అద్దె భవనాల్లో నిర్వహించే అంగన్‌వాడీలకు అద్దె డబ్బులు సైతం విడుదల చేశారు. అయితే ఆయా కార్యకర్తలకు జమ అయ్యే బిల్లుల ప్రాప్తికి దాంట్లో 10 శాతం కార్యాలయానికి అందజేయాలని సారవకోట, జలుమూరు మండలాల్లో ఉన్న 8 సెక్టార్ల లీడర్లకు ఈ బాధ్యతను సంబంధిత కార్యాలయ సిబ్బంది అప్పగించినట్లు తెలుస్తోంది. ఏ కార్యకర్త ఎంత ముట్టజెప్పాలో తెలిపే జాబితాలు లీడర్లుకు అందజేశారు. దీంతో ఆయా లీడర్లు వారి సెక్టార్ వాట్సాప్ గ్రూపుల్లో వాయిస్ మెసేజ్‌లు, జాబితాలు షేర్ చేశారు. కొన్ని సెక్టార్ల లీడర్లు ఇప్పటికే డబ్బులు వసూలు చేయగా, మరికొన్ని సెక్టార్ల లీడర్లు వసూలు చేస్తున్నారు. అయితే కొంతమంది అంగన్‌వాడీ కార్యకర్తలు ఈ పర్సంటేజీలు ఇచ్చేందుకు వ్యతిరేకిస్తున్నారు. కూరగాయల కోసం ప్రభుత్వం మంజూరు చేసే బిల్లు తక్కువగా ఉందని, కానీ మార్కెట్లో కూరగాయల రేట్లు అధికంగా ఉన్నాయని బిల్లులు కూడా ఎన్నో నెలలకు ఒకసారి మంజూరు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంట్లో ఎలా పర్సంటేజీలు ఇవ్వగలమని వాపోతున్నారు.
రూ.2 లక్షల వరకు వసూలు..?
ప్రస్తుతం అంగన్‌వాడీ కార్యకర్తలకు చెల్లించిన కూరగాయలు, అద్దె భవనాల బిల్లుల నుంచి సుమారు రూ.2 లక్షల వరకు వసూలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ డబ్బులను కార్యాలయ సిబ్బంది ఎవరి జేబులు నింపడానికి వసూలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇంటలజెన్స్ వాళ్లు ఆరా తీస్తున్నారు. కాగా ఈ విషయంపై సారవకోట ఐసీడీఎస్ సీడీపీవో వంశీ ప్రియను వివరణ కోరగా.. బిల్లులు తాము ట్రెజరీకి పంపిస్తున్నామని, వారు కొర్రీలు పెట్టి తిరిగి పంపిస్తున్నారని తెలిపారు. ట్రెజరీ వారికిచ్చేందుకు తాము వసూలు చేస్తున్నామని వెల్లడించారు.


