టెక్కలి రూరల్: మండలంలోని బొరిగిపేట ప్రాథమికోన్నత పాఠశాలలో టీచర్ల సర్ధుబాటు ప్రక్రియ గ్రామస్తుల్లో ఆందోళనకు దారితీసింది. తమ పాఠశాల ఉపాధ్యాయులను సర్ధుబాటు ప్రక్రియలో భాగంగా వేరే పాఠశాలకు పంపించడం సమంజసం కాదని, తమ పాఠశాలలో ఉపాధ్యాయులు పాఠశాలలోనే ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు పాఠశాల ముందు మంగళవారం ఆందోళన చేపట్టారు. అనంతరం టెక్కలి మండల విద్యాశాఖ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని బొరిగిపేట ప్రాథమికోన్నత పాఠశాలలో 66 మంది విద్యార్థులు ఈ ఏడాది ఉన్నారు. వీరిలో 39 మంది ప్రాథమిక పాఠశాల విద్యార్థులు కాగా, 27 మంది ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికోన్నత పాఠశాలలో 31 మంది విద్యార్థులు కంటే తక్కువ మంది విద్యార్థులు ఉన్నట్లయితే పాఠశాలలో ఉపాధ్యాయులను సద్దుబాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో పాఠశాలలో ఉన్న నలుగురు స్కూల్ అసిస్టెంట్లకు గానూ ఇద్దరు ఉపాధ్యాయులను వేరే పాఠశాలకు బదిలీ చేసే కార్యక్రమం చేపట్టారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పాఠశాల వద్దకు వెళ్లి ఆందోళన చేపట్టారు. తమ ఊరులో పాఠశాల ఉండాలనే ఉద్దేశంతో ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను సైతం ప్రభుత్వ పాఠశాలలో చేర్పించామని తెలిపారు. ఒకవేళ ఉపాధ్యాయులను వేరే పాఠశాలకు బదిలీ చేసినట్లయితే వెంటనే విద్యార్థులకు టీసీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై విద్యాశాఖ అధికారులు దాట్ల దాశరథి, దాసుపురం చిన్నారావులు మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయం మేరకు ఉపాధ్యాయుల పని సద్దుబాటు కార్యక్రమం చేపట్టామని తెలిపారు. గ్రామస్తుల డిమాండ్‌ను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఉపాధ్యాయులను నియమించే విధంగా చూస్తామని తెలిపారు.


