ఆమదాలవలస: శ్రీకాకుళం రోడ్ (ఆమదాలవలస) రైల్వేస్టేషన్‌లో 1971 నుంచి కొనసాగుతున్న ఏఈఎన్, ఐవోడబ్ల్యూ కార్యాలయాలను పలాసకు తరలించేందుకు దక్షిణ తూర్పు రైల్వే అధికారులు పరిపాలన అనుమతులు మంజూరు చేశారు. దీంతో తరలింపు చర్యలు చేపట్టడానికి అధికారులు సమాయత్తం కావడంపై రైల్వే ఉద్యోగులు, ప్రజలు, వ్యాపారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 1971వ సంవత్సరంలో అప్పటి ఎంపీ బొడ్డేపల్లి రాజగోపాలరావు కృషితో శ్రీకాకుళం రోడ్ రైల్వేస్టేషన్‌లో పలు కార్యాలయాల నిర్మాణాలు జరిగాయని, నేడు ఆ ప్రభ మసకబారుతుందని పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం రోడ్డు(ఆమదాలవలస) రైల్వేస్టేషన్ పరిధిలో ఈ రెండు కార్యాలయాలు ఉండడం వలన రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాల్లోని సుమారు 60 షాపుల నిర్వహణ, రైల్వే నిర్మాణ పనులు, నీటి సరఫరా, ట్రాక్‌ల నిర్వహణ వంటి పనులు సకాలంలో జరుగుతున్నాయి. అలాగే పొందూరు నుంచి పూండి వరకు రైల్వే పరిధిలో జరిగే అభివృద్ధి, నిర్వహణ కార్యక్రమాలను ఈ కార్యాలయాలే పర్యవేక్షిస్తున్నాయి. ఈ కార్యాలయాలను పలాసకు తరలిస్తే పొందూరు నుంచి పూండి వరకు ఉన్న ప్రజలు, విశ్రాంత రైల్వే ఉద్యోగులు రైల్వే సంబంధిత అవసరాల కోసం సుమారు 70 కిలోమీటర్ల దూరంలోని పలాసకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద శ్రీకాకుళం రోడ్ రైల్వేస్టేషన్‌ను కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న వేళ, ఇక్కడి కీలక కార్యాలయాలను ఇతర ప్రాంతాలకు తరలించడం స్టేషన్ ప్రాధాన్యాన్ని తగ్గించే చర్యగా అభిప్రాయపడుతున్నారు.


