శఠగోపం | - | Sakshi
Sakshi News home page

శఠగోపం

Jul 7 2026 1:43 AM | Updated on Jul 7 2026 1:43 AM

ఆదిత్యుని సొమ్ముకు

ఆదిత్యుని హుండీ కానుకల లెక్కింపులో చేతివాటం

రూ.11,500 దొంగిలించి దొరికిపోయిన విశాఖకు చెందిన కృష్ణారావు

అరెస్టు చేసిన పోలీసులు

అరసవల్లి: ప్రత్యక్ష భగవానుడి సన్నిధిలో ఓ వ్యక్తి సేవ పేరు తో చొరబడి చోరకళ ప్రదర్శించాడు. స్వచ్ఛందంగా హుండీ ఆదాయం లెక్కింపులో పాల్గొని డబ్బులు కాజేయాలని చూసి దొరికిపోయాడు. ఆలయంలో సోమవారం హుండీ కానుకల లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. విజయనగరం, విశాఖ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన స్వచ్ఛంద సేవకుల బృందాలు నగదును, మహిళలంతా చిల్లరను లెక్కించారు. ఇంతలో విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం బొచ్చపేట గ్రామానికి చెందిన బి.కృష్ణారావు అనే వ్యక్తి విజయనగరానికి చెందిన శ్రీవారి సేవ సంఘం ముసుగులో వచ్చి నగదును లెక్కిస్తూనే రూ.11,500 డబ్బును తన దుస్తుల్లో దాచేశాడు. ఇలా కొట్టేసిన రూ.500 నోట్ల చిన్న కట్ట (23 నోట్లు)తో బయటకు వెళ్తున్న క్రమంలో సెక్యూరిటీకి చిక్కాడు. దీంతో ఆలయ ఈఓ కేఎన్‌వీడీవీ ప్రసాద్‌తో పాటు పర్యవేక్షణాధికారిగా వచ్చిన జిల్లా దేవదాయ శాఖ సహాయ కమిషనర్‌ ప్రసాద్‌ పట్నాయక్‌లు అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆలయ ఈఓ ప్రసాద్‌ నేరుగా దొంగ చేతిలోని నోట్లను స్వాఽధీనం చేసుకుని సీజ్‌ చేయించారు. బృందం సభ్యులను కూడా విచారించి కృష్ణారావును పోలీసులకు అప్పగించారు. దీంతో ఒక్కసారిగా ఆలయ పరిసరాల్లో హడావుడి నెలకొంది. హుండీ కానుకల లెక్కింపునకు వచ్చిన స్వచ్ఛంద సేవకులందరినీ చెక్‌ చేయించి తిరిగి లెక్కింపు విధులను అప్పగించారు.

పర్యవేక్షణ లోపం..

ఆదిత్యుని ఆలయంలో నిఘాలో డొల్లతనం ఈ ఘటనతో తేటతెల్లమైంది. ఆలయంలో సగటున ప్రతి మూడు నెలలకు ఒకసారి హుండీ కానుకల లెక్కింపు చేపడుతుంటారు. పెద్ద ఎత్తున నగదును లెక్కింపునకు వీలుగా అన్నవరం, సింహాచలం మాదిరిగానే ఇక్కడకు కూడా వివిధ స్వచ్ఛంద సేవకుల సంఘం పేరిట వృద్ధులు, రిటైర్డ్‌ ఉద్యోగులు, మహిళలు వచ్చి లెక్కింపులో పాల్గొంటారు. కానీ మిగిలిన ఆలయాల్లో ఉన్న నిఘా వ్యవస్థ ఇక్కడ కనిపించడం లేదు.

కాళ్లతో డబ్బును ఈడుస్తుంటే ఆపాను

లెక్కింపు మధ్యలో తిరిగి వెళ్లిపోయేందుకు గేటు వద్దకు వస్తుంటే కాళ్ల మధ్య లో దాచుకున్న నగదు కట్ట కిందకు జారింది. కాళ్లతోనే డబ్బును ఈడుస్తూ కనిపించాడు. దీంతో వెంటనే నిలువరించి అతడిని ఆపాను.

– వి.ధనలక్ష్మి, ప్రైవేటు సెక్యూరిటీ, అరసవల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement