● ఎరువుల కోసం ఎదురుచూపులు మళ్లీ మొదలు
● ధరలపై అదనపు వడ్డనలు
బూర్జ: మండలంలో గల బూర్జ పీఏసీఎస్ కార్యాలయంలో రైతులు ఖరీఫ్ సీజన్‌లో ఎరువు కోసం ఆదిలోనే నానా ఇబ్బందులు పడుతున్నారు. కార్యాలయానికి ఒక్క డీఏపీ మాత్రమే వచ్చింది. శనివారం కార్యాలయానికి డీఏపీ కోసం వస్తే ఓటీపీ రావడం లేదని తిరిగి పంపించారని, అలాగే సోమవారం కూడా కార్యాలయానికి వెళ్తే ఓటీపీ వచ్చిన వారికే ఎరువుల ఇస్తామని చెబుతున్నారని బూర్జ గ్రామానికి చెందిన రైతులు చౌదరి ప్రతాప్ చౌదరి, అల్లు మురళి, చిన్న కురిమి పేట గ్రామానికి చెందిన ఇ.సూర్యారావు, కె.గణపతి, పి.అసిరినాయుడు, వావాం గ్రామానికి చెందిన సీహెచ్ సీతారాం తదితరులు ఆరోపించారు.
యూరియా @ రూ.350
గార: యూరియాపై అదనపు వడ్డనలు మొదలైపోయాయి. ఒక్కో బస్తా రూ. 270లు ప్రభుత్వ ధరకు అమ్మాల్సి ఉన్నా ఒక్కో ఎరువుల డీలర్ ఒక్కోలా రూ. 350 లు వరకు అమ్మకాలు జరుపుతున్నారు. ప్రభుత్వం ఈ ఏడాది పెట్టిన ఏపీఏఐఎంస్ యాప్ ద్వారా ఆధార్ నమోదు చేసి, భూమి విస్తీర్ణం మేరకు యూరియా ఇస్తున్నారు. అయినా అధిక ధరలకు కొనాల్సిన పరిస్థితుల్లో రైతులు ఆవేదన చెందుతున్నారు. గార మండలంలో నారాయణపురం, వంశధార కాలువ పరిధిలో ముందుగా వరి వెదసాగు మొదలైంది. రెండు రోజుల కిందట వర్షాలు మొదలవ్వడంతో ఎరువుల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. గ్రామాల్లోని రైతు సేవా కేంద్రాల (రైతు భరోసా కేంద్రాలు) ద్వారా యూరి యా అమ్మకాలు జరిగితే ప్రభుత్వ ధరకే దొరుకుతుంది. మండలంలో ఎక్కడా ఆర్‌ఎస్‌కేల ద్వారా అమ్మకాలు జరపకపోవడంతో కేవలం ప్రైవేట్ డీలర్లపైనే రైతులు ఆధారపడుతున్నారు. ఈ విషయమై ఏఓ డి.పద్మావతి వద్ద ప్రస్తావించగా అధిక ధరలకు అమ్మవద్దని ఇప్పటికే స్పష్టం చేశామని, కఠిన చర్యలు తప్పవన్నారు.


