నరసన్నపేట: దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని బుధవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అన్ని నియోజకవర్గాలు, మండలాల్లో జయంతి కార్యక్రమాలు చేయాలని, సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. పార్టీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్టీ ప్రతినిధులు, అనుబంధ సంఘాల కమిటీల ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
ఎస్సీ కేటగిరీ ఖాళీ సీట్ల భర్తీ
శ్రీకాకుళం పాతబస్టాండ్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాలలో ఎస్సీ (ఇ) కేటగిరీలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఆసక్తి గల విద్యార్థులు సంబంధిత గురుకుల పాఠశాలల ను నేరుగా సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కో ఆర్డినేటర్ వై.యశోద లక్ష్మి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 5వ తరగతికి సంబంధించి దుప్పలవలస, కంచిలి, పెద్దపాడు, నందిగాం, కొల్లివలస, మందస, పాతపట్నం గురుకుల పాఠశాలల్లోను, 6వ తరగతికి సంబంధించి కంచిలి, నందిగాం, పాతపట్నం గురుకుల పాఠశాలలో ఉన్నట్లు వివరించారు. ఇంటర్మీడియెట్‌కు సంబంధించి కంచిలి, నందిగాం, మందస గురుకుల జూనియర్ కళాశాలలో ఖాళీగా సీట్లకు అర్హత కలిగిన ఎస్సీ కేటగిరీ విద్యార్థులు వెంటనే సంబంధిత గురుకుల పాఠశాలలకు వెళ్లి దరఖాస్తు సమర్పించాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. వివరాలకు 9701736862 నంబర్‌ను సంప్రదించాలన్నారు.
గొట్టా బ్యారేజీ నుంచి నీరు విడుదల
హిరమండలం: ఖరీఫ్‌లో శివారు ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తామని వంశధార ప్రాజెక్టు చైర్మన్ ఎ.రవీంద్ర, వంశధార ఎస్‌ఈ జి.రామచంద్రరావు అన్నారు. సోమ వారం ప్రాజెక్టు డైరెక్టర్లు, వంఽశధార అధికారులతో కలిసి గొట్టా బ్యారేజీ నుంచి ఎడమ, కుడి ప్రధాన కాలువలోకి నీరు విడుదల చేశారు. ముందుగా గంగమ్మతల్లికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. శివారు ప్రాంతాలకు నీరు అందేవిధంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ ఏడాది అనుకున్న సమయంలో వర్షాలు పడలేదని, ఇటీవల పడుతున్న వర్షాలకు వచ్చిన నీటిని బ్యారేజీలో నిల్వ ఉంచామన్నారు. ప్రస్తుతం 37 మీటర్ల నీటిమట్టం ఉందన్నారు. ఎడమ ప్రధాన కాలువ ద్వారా 300 క్యూసెక్కులు, కుడి ప్రధాన కాలువ ద్వారా 100 క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టినట్లు తెలిపారు.


