సంతబొమ్మాళి: తీరప్రాంత భూములపై అధికార పార్టీ నాయకుల కన్ను పడింది. ఈ భూములను ఆదాయ వనరులుగా మార్చుకోవడానికి బరితెగిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని భావనపాడు తీర ప్రాంతంలో సీఆర్‌జెడ్ భూములపై అధికార పార్టీ నాయకుడు కన్ను పడింది. దీంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ భూమిలో ఉన్న సరుగుడు చెట్లను నరికేసి వాల్టా చట్టం ఉల్లంఘించాడు. అంతటితో ఆగకుండా ఆక్రమించిన స్థలాన్ని ఆదాయ వనరుగా మార్చుకోవడానికి పూనుకున్నాడు. దీనిలో భాగంగా రెండు గదుల నిర్మాణానికి పునాదులు వేశాడు. దీంతో అక్రమ నిర్మాణాన్ని భావనపాడు మైరెన్ సీఐ రాము అడ్డుకున్నారు. ఈ క్రమంలో మైరెన్ సీఐతో అధికార పార్టీ నాయకుడు వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. ఆక్రమణపై తహసీల్దార్ హేమసుందర్‌రావుకు మైరెన్ సీఐ సమాచారం అందజేశారు. తహసీల్దార్ ఆదేశాలతో ఆర్‌ఐ చంద్రమౌళి సోమవారం అక్రమ నిర్మాణాలను పరిశీలించి నిలుపుదల చేశాడు. దీనిపై నివేదికను ఉన్నతాధికారులను అందజేస్తామని రెవెన్యూ అధికారులు పేర్కొన్నారు.


