శ్రీకాకుళం క్రైమ్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఎస్పీ గ్రీవెన్స్(పీజీఆర్‌ఎస్)కు బాధితుల నుంచి 57 ఫిర్యాదులు అందాయి. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి బాధితులతో నేరుగా మాట్లాడి న్యాయం చేస్తానని భరోసా అందించారు.
నా కుమార్తె ఆత్మహత్యకు ఉన్నతాధికారులే కారణం
తన కుమార్తె స్వప్నప్రియ ఆత్మహత్యకు ఎస్‌బీఐ ఉన్నతాధికారుల వేధింపులే కారణమని ఆరోపిస్తూ జిల్లా కేంద్రంలో నివసిస్తున్న ఉరిటి సరళ ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డికి ఫిర్యాదు చేశారు. గతంలో ఎస్బీఐ గార శాఖలో డిప్యూటీ మేనేజర్‌గా పనిచేసిన తన కుమార్తె స్వప్నప్రియను ఆత్మహత్యకు ప్రేరేపించడం, బెదిరింపులు, క్రిమినల్ కుట్రలకు సంబంధించి ఆధారాలను ఎస్పీకి అందజేశారు. ఎస్బీఐ రీజనల్ మేనేజర్ టీఆర్‌ఎం రాజు, క్యాష్ ఆఫీసర్ ముంజేటి సురేష్, జాయింట్ కస్టోడియన్ జి.లోకనాథం, బ్రాంచి మేనేజర్ రాధాకృష్ణతో పాటు మరికొందరు తాకట్టు బంగారం మాయం కేసులో బాధ్యులని ఆరోపించారు. వీరిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. నిందితులను అరెస్టు చేసి విచారణా నివేదికలు బహిర్గతం చేయాలని కోరారు.


