శ్రీకాకుళం క్రైమ్: శ్రీకాకుళం నగరంలో మరోమారు చైన్ స్నాచింగ్ జరిగింది. సోమవారం రాత్రి పీఎన్ కాలనీలో ఐదో లైన్‌లో కనితి నిర్మల అనే మహిళ వాకింగ్ చేస్తుండగా బైక్‌పై వచ్చిన అగంతకుడు మెడలో తులంపావు గొలుసు తెంపేసి పరారయ్యాడు. ఖంగు తిన్న ఆమె కేకలు వేయడంతో స్థానికులు చేరారు. ఘటనా స్థలానికి డీఎస్పీ సీహెచ్ వివేకానంద, ఒకటో పట్టణ సీఐ పైడపు నాయుడు చేరుకున్నారు.
ఏఈవో అప్పలనాయుడు బదిలీ
అరసవల్లి: ప్రసిద్ధ అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో సహాయ కార్యనిర్వహణాధికారి(ఏఈవో)గా పనిచేస్తున్న గడి అప్పలనాయుడుకు సింహాచలం శ్రీవరాహనర్సింహస్వామి ఆలయ ఏఈవోగా బదిలీ చేస్తూ దేవదాయ శాఖ రాష్ట్ర కమిషనరేట్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు ఆయన ఒకటెండ్రు రోజుల్లో అరసవల్లి నుంచి రిలీవ్ అయ్యి, సింహాచలంలో బాధ్యతలు చేపట్టనున్నారు.
మండపాన్ని పునర్నిర్మించాలి
మందస: పట్టణంలోని చారిత్రాత్మక గోపాల్ సాగర్ సుందరీకరణ పనుల పేరుతో ప్రాచీన కట్టడాలను ధ్వంసం చేస్తుండడంపై స్థానిక ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గతంలోనే ఇక్కడి పురాతన కట్టడాలకు నష్టం వాటిళ్లుతోందని స్పందనలో అధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ, ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో అధికారుల నిర్లక్ష్యాన్ని ఆసరాగా చేసుకుని ఆదివారం ఎంతో విశిష్టమైన రాళ్లతో పరిచిన మండపాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. శతాబ్ధాల చరిత్ర కలిగిన ఈ నిర్మాణాన్ని కూల్చివేయడాన్ని గమనించిన స్థానిక ప్రజలు, ప్రాచీన కట్టడాల పరిరక్షణ కమిటీ కన్వీనర్ మామిడి కోదండరావు తదితరులు అడ్డుకున్నారు. ఈ మేరకు చారిత్రక విధ్వంసానికి నిరసనగా అధికారులకు ప్రజా సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు కలిసి సోమవారం వినతిపత్రం అందజేశారు. కూల్చివేసిన మండపాన్ని పునర్నిర్మించాలని కోరారు. కార్యక్రమంలో రట్టి లింగరాజు, శ్రీనివాస్ పాడి, పురుషోత్తం బెహరా, దువ్వ జగదీష్, యర్రనాగుల శ్రీను, పూర్ణచందు, మట్టా బెనర్జీ, పూర్ణచంద్ర, కురేష్, శంకర్, వీరాస్వామి, బాలు, పురుషోత్తం, నిరంజన్, గయా, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
కాలువ నిర్మాణంలో స్థల వివాదం
టెక్కలి రూరల్: స్థానిక అయ్యప్పనగర్‌లో జరుగుతున్న కాలువల నిర్మాణంలో సోమవారం స్థల వివాదం చోటుచేసుకుంది. అయ్యప్పనగర్ నుంచి భవానీనగర్ వెళ్లే మార్గంలో కె.నాగరాజు అనే వ్యక్తికి చెందిన స్క్రాప్ దుకాణం ఉంది. అయితే నాగరాజుకు చెందిన షాపులో కొంతభాగం ప్రభుత్వ స్థలం ఉందని గతంలో వేసిన మార్కింగ్ వరకు దానిని తొలగించి కాలువ నిర్మాణం చేపట్టాలని అధికారులు చెప్పారు. దీంతో షాపు యజమాని తన వద్ద డాక్యుమెంట్స్ ఉన్నాయని, ప్రభుత్వ స్థలం లేదంటూ కాగితాలు చూపిస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోలేదంటూ వాపోయాడు. అధికార పార్టీ నేతలు చెప్పడంతో అధికారులు తన షాపును తొలగిస్తున్నారని వాగ్వాదానికి దిగాడు. అయితే బాధితుడు ఎంత చెప్పినా వినకుండా సంబంధిత అధికారులు పోలీసులు సమక్షంలో షాపులో కొంతభాగాన్ని జేసీబీ సాయంతో తొలగించారు.
నిరుద్యోగ యువతకు శిక్షణ
ఎచ్చెర్ల: స్థానిక యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి సంస్థ ఈనెల 15వ తేదీ నుంచి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా యువతకు ఉపాధి శిక్షణను ప్రారంభించనుందని సంస్థ డైరెక్టర్ రామ్‌జీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సీసీటీవీ ఇన్‌స్టాలేషన్ విభాగంలో 13 రోజులు పాటు ఉచిత శిక్షణను ప్రారంభించనున్నామని వెల్లడించారు. శిక్షణా కాలంలో ఉచిత వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తామని వెల్లడించా రు. మరిన్ని వివరాలకు 95534 10809, 79933 40407 నంబర్లను సంప్రదించాలని కోరారు.


