అర్జీదారులు సంతృప్తి చెందాలి | - | Sakshi
Sakshi News home page

అర్జీదారులు సంతృప్తి చెందాలి

Jul 7 2026 1:43 AM | Updated on Jul 7 2026 1:43 AM

జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌

పీజీఆర్‌ఎస్‌లో 179 వినతుల స్వీకరణ

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: అధికారులు ఇచ్చే సమాధానంతో అర్జీదారులు సంతృప్తి చెందాలని జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌ అధికారులను ఆదేశించారు. స్థానిక జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్‌)ను సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయా శాఖల అధికారులు ప్రజల సమస్యలను పరిష్కరించాలని సూచించారు. అర్జీలు పునరావృతం కాకుండా చూడాలని స్పష్టం చేశారు. మొత్తం 179 ఆన్‌లైన్‌ అర్జీలు స్వీకరించగా ఇందులో రెవెన్యూ 43, పంచాయతీ రాజ్‌ 20, సొసైటీ ఫర్‌ ఎలిమినేషన్‌ ఆఫ్‌ రూరల్‌ పావర్టీ 26, వ్యవసాయ శాఖ 14, సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ 16, వాటర్‌ రిసోర్సెస్‌ ఈఎన్సీ 9, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ 7, ఏపీఈపీడీసీఎల్‌ 6, పంచాయతీ రాజ్‌ ఇంజినీరింగ్‌ 5, రూరల్‌ డవలప్‌మెంట్‌ 4, హోం శాఖ 4, గ్రామీణ నీటి సరఫరా, పౌర సరఫరాలు, విద్యాశాఖలకు సంబంధించి మూడేసి అర్జీలు చొప్పున స్వీకరించారు. విభిన్న ప్రతిభావంతులు శాఖ, కాలేజీ ఎడ్యుకేషన్‌కు సంబంధించి రెండేసి అర్జీలు చొప్పున స్వీకరించగా, బీసీ కార్పొరేషన్‌, ఆర్‌అండ్‌బీ, స్కిల్‌ డవలప్‌మెంట్‌, రవాణా శాఖ, సమగ్ర శిక్ష తదితర శాఖలకు సంబంధించి ఒక్కొక్క వినతులు వచ్చాయి. కార్యక్రమంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ హరిఓం పాండ్య, జిల్లా రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు, డిప్యూటీ కలెక్టర్‌ పద్మావతి తదితరులు పాల్గొన్నారు.

పలు వినతులు పరిశీలిస్తే...

● రానున్న వర్షాకాల పార్లమెంట్‌ సమావేశాల్లో చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ సౌకర్యం కల్పించేందుకు ఉద్దేశించి 2023లో పార్లమెంట్‌లో ఆమోదం పొందిన నారి శక్తి వందన్‌ అధినీయం 2023 బిల్లుని ప్రవేశపెట్టి, చట్టరూపంలో అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ మహిళా సమాఖ్య శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి పుక్కళ్ల అరేలమ్మ వినతిపత్రం అందజేశారు. ఆమెతో పాటు బడే మాడికమ్మ, పుక్కళ్ల లోలాక్షి, ఏఐవైఎఫ్‌ నాయకుడు సంతోష్‌ కుమార్‌ తదితరులు ఉన్నారు.

● శ్రీకాకుళం నగరంలోని పెద్ద రెల్లివీధిలో నాగావళి నదికి ఆనుకుని ఉన్న రివర్‌ బెడ్‌ ఉన్న ఖాళీ ప్రభుత్వ స్థలాన్ని కొంతమంది ఆక్రమించుకొని నిర్మాణాలు చేపడుతున్నారని, వారిపై తగు చర్యలు తీసుకోవాలని ఎ.ఈశ్వరరావు, ఎ.సంతోష్‌, కోటి, చింతు తదితరులు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా పెద్ద రెల్లివీధికి చెందిన కొంతమంది వ్యక్తులు ఆ స్థలాన్ని ఆక్రమించుకొని ఒక పెద్ద భవనాన్ని నిర్మాణం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఆక్రమణపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని తెలిపారు. ఇప్పటికై నా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement