శ్రీకాకుళం: శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమిషనర్ కూర్మారావుకు బదిలీ ఉత్తర్వులు వచ్చిన సందర్భంలో కార్యాలయ ఆవరణలోనే బాణసంచా కాల్చడాన్ని ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ఈ విషయం తొలుత సాక్షిలో కథనంగా ప్రచురితం కావడంతో జిల్లా కలెక్టర్, ఎస్పీలు విచారణ జరపాలని పోలీసులకు ఆదేశించారు. తక్షణమే రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజీ సేకరణ కోసం శనివారం కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లగా.. దీనిని పర్యవేక్షించే ఉద్యోగి లేడని, సోమవారం రావాలని తిప్పి పంపించినట్లు సమాచారం. సోమవారం ఉదయం నగరపాలక సంస్థ కార్యాలయానికి మరోసారి పోలీసులు వెళ్లి సీసీ ఫుటేజీ కోసం పరిశీలించగా, ఆ ఒక్క ఘటనకు సంబంధించిన అంశాలు రికార్డు లేకపోవడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. దీనిని ఎవరైనా డిలీట్ చేసి ఉంటారని మరోసారి నిపుణులతో కూడిన బృందంతో వస్తా మని చెప్పి పోలీసులు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.
ప్రశ్నించిన పోలీసులు..?
కాగా పోలీసులు క్షుణ్ణంగా చిత్తశుద్ధితో తనిఖీలు చేస్తే ఎవరైనా డిలీట్ చేసినా పోలీసుల వద్ద ఉండే ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో తొలగించిన ఫుటేజీ తిరిగి పొందవచ్చని పలువురు అంటున్నారు. కార్యాలయంలోని కొందరు ఉద్యోగులను కూడా పోలీసులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. వారిచ్చిన సమాచారం ఆధారంగా బాణసంచా బయట వ్యక్తులు కాల్చినప్పటికీ.. దీని వెనుక ప్రధాన పాత్ర పోషించిన ఉద్యోగి ఎవరన్నది కూడా పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న సదరు ఉద్యోగి ఈ కేసు ముందుకు సాగకుండా ఉండేలా ప్రజాప్రతినిధులపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు బోగట్టా. ఇందులో భాగంగానే సీసీ ఫుటేజీ మాయం చేశారని నగరపాలక సంస్థ కార్యాలయ ఉద్యోగ వర్గాల నుంచి వినిపిస్తోంది. కమిషనర్ కూర్మారావు బదిలీకి కూడా తానే కారణమని, సీఎంవోకు ఫిర్యాదు చేయించానని ఈ ఉద్యోగి కార్పొరేషన్ కార్యాలయంలో ప్రచారం చేసుకుంటున్నట్లు పలువురు ఉద్యోగులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా కూర్మారావు బదిలీ ఉత్తర్వులు చూడగానే కార్యాలయంలో ఓ ‘ప్లాన్ ప్రకారం అనారోగ్య వ్యాఖ్యానాలు చేసిన ఇద్దరు అధికారుల వ్యవహారాన్ని కూడా కొందరు ఉద్యోగులు పోలీసులు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలియ వచ్చింది. దీంతో ఈ ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తే ఎన్నో ఆశ్చర్యకర విషయాలు వెలుగు చూస్తాయని పలువురు చెబుతున్నారు. పోలీసులు వచ్చిన విషయాన్ని ఇన్‌చార్జి కమిషనర్ డాక్టర్ సుధీర్ వద్ద సాక్షి ప్రస్తావించగా పోలీసులు వచ్చి పరిశీలన జరిపిన విషయం వాస్తవమేనన్నారు. సీసీ ఫుటేజీ లేనట్లు చెప్పారని, మరలా వచ్చి పరిశీలన చేస్తామన్నారని పేర్కొన్నారు.
కార్పొరేషన్ కార్యాలయంలో బాణసంచా కాల్చిందెవరు..?
ఘటనపై ఉన్నతాధికారుల సీరియస్
సీసీ ఫుటేజీ సేకరించేందుకు వెళ్లిన పోలీసులు
ఫుటేజీ లేకపోవడంతో ఆశ్చర్యం


