● బూరగాంలో అల్లూరికి ఘన నివాళి
జానపద
ప్రదర్శనలు ఇస్తున్న
దృశ్యం
కంచిలి: మండలంలోని బూరగాం గ్రామం సోమవారం జానపదంతో మార్మోగింది. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల్లో భాగంగా ప్రజా కళామండలి ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమ రూపంలో సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా అల్లూరి చిత్రపటానికి నివాళులతో మొదలైన కార్యక్రమం కాసేపట్లోనే జన జాతరగా మారింది. ప్రజా కళామండలి రాష్ట్ర కార్యదర్శి కొర్రాయి నీలకంఠం, బొట్ట శ్రీరాములు నేతృత్వంలో కళాకారులు జానపద పాటలు, కోలాటాలు, డప్పు నృత్యాలతో గ్రామ వీధుల్లో ప్రదర్శనలిచ్చారు. ఉద్దా నం ప్రాంతంపై కార్పొరేట్ సంస్థల కబ్జా దాడులు, ఉత్తరాంధ్రను అభివృద్ధిలో వెనక్కి నెడుతున్న తీరు, ఆడపిల్లల భద్రత, సామాజిక చైతన్యం వంటి అంశాలను పాటల రూపంలో ప్రజల ముందు ఉంచారు. ‘ఉద్దానం మా ఊపిరి.. కార్పొరేట్ దోపిడీ వద్దు’ అంటూ సాగిన పాటలకు ప్రజలు చేతులు ఊపుతూ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ప్రజా నాట్య మండలి రాష్ట్ర కార్యదర్శి కొర్రాయి నీలకంఠం మాట్లాడుతూ.. అల్లూరి బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసినట్లు, నేడు ప్రజలు కార్పొరేట్ శక్తులు, వివక్షపై తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా కార్యదర్శి కుసుమ మాట్లాడుతూ అల్లూరి త్యాగాన్ని స్మరించుకోవడమే కాదు, ఆయన చూపిన తెగువతో సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు. సామాజిక కార్యకర్త అరుణక్క మాట్లాడుతూ.. జానపదం ద్వారానే మారుమూల గ్రామాల్లోకి చైతన్యం తీసుకెళ్లవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నేతలు మడ్డు వెంకటరావు, మాస్టీల మన్మథరావు, మడ్డు అభి తదితరులు పాల్గొన్నారు.


