● అధికారులు అధికార పార్టీకి
సహాయపడుతున్నారు
● పీజీఆర్‌ఎస్‌లో పేరాడ తిలక్ ఫిర్యాదు
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఎస్‌ఐఆర్‌లో భాగంగా టెక్కలి నియోజకవర్గంలో అధికారులు దొంగ ఓట్లు తొలగించడం లేదని వైఎస్సార్‌సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ ఆరోపించారు. ఈ మేరకు పీజీఆర్‌ఎస్‌లో సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టెక్కలి, కోటబొమ్మాళి మండలాల్లోని పోలింగ్ స్టేషన్లు వారీగా చనిపోయిన ఓటర్ల వివరాలు, వలస వెళ్లినవారి వివరాలను జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌కి వివరించారు. టెక్కలి నియోజకవర్గంలోని పలు పోలింగ్ కేంద్రాల్లో సంవత్సరాలుగా కొనసాగుతున్న అక్రమ ఓట్లను తొలగించాలని, అలాగే టెక్కలి గ్రామ పంచాయతీలో జరుగుతున్న సర్ ఓటర్ల సర్వేలో ఉన్న లోపాలను వెంటనే సరిదిద్దాలని విన్నవించారు. అధికారులు అధికార పార్టీకి సహాయపడుతూ వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్లను అడ్డుగోలుగా తొలగించేలా ఎస్‌ఐఆర్ చేపడుతున్నారన్నారు. సుమారు 25 వేల మంది ఓటర్లు ఉన్న టెక్కలి గ్రామ పంచాయతీలో ఇప్పటికీ అనేక మంది ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు అందలేదని, అయినప్పటికీ పంపిణీ చేసినట్లు ఆన్‌లైన్‌లో నమోదవుతోందని తెలిపారు. బూత్ లెవల్ అధికారులకు తగిన అవగాహన లేకపోవడం వల్ల సర్వే ప్రక్రియ నెమ్మదిగా సాగుతోందని, 20 రోజులు గడిచినా అనేక పోలింగ్ కేంద్రాల్లో 20 నుంచి 45 శాతం వరకు మాత్రమే డిజిటలైజేషన్ పూర్తైందని చెప్పారు. అర్హులైనవారు ఓటుహక్కును కోల్పోకుండా జిల్లా యంత్రాంగం తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నందిగాం ఎంపీపీ నడుపూరు శ్రీరామ్మూర్తి, టెక్కలి నియోజకవర్గ యువజన విభాగ అధ్యక్షుడు చిన్ని జోగారావు యాదవ్, మేఘవరం మాజీ సర్పంచ్ పరపతి శ్రీనివాసరెడ్డి, టెక్కలి నియోజకవర్గ ఎస్సీసెల్ అధ్యక్షుడు కర్ణిక జీవన్‌రావు, టెక్కలి మండల ఐటీ విభాగం అధ్యక్షుడు బడ్డ రాజేష్, కోటబొమ్మాళి మండల పార్టీ అధ్యక్షుడు హేమసుందర రాజు పాల్గొన్నారు.


