శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): దస్తావేజు లేఖరుల పొట్టకొట్టే జీవో నంబర్ 396ను అమలు చేసే ఆలోచన విరమించుకోవాలని శ్రీకాకుళం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ దస్తావేజు లేఖరులు కోరారు. రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ అండ్ స్టాంపుల శాఖలో స్థిరాస్తుల కోసం దస్తావేజు రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రైవేటీకరణ చేసేందుకు సిద్ధమవుతున్న జీవోను వ్యతిరేకిస్తూ శ్రీకాకుళం పట్టణ దస్తావేజు లేఖరులు, స్టాంపు వెండర్లు, లేఖరుల సహాయకులు, డీటీపీ ఆపరేటర్లు జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద సోమవారం నిరసన తెలియజేశారు. అనంతరం సబ్ రిజిస్ట్రార్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నోతరాల నుంచి దస్తావేజు లేఖరులకు ప్రభుత్వం దస్తావేజు లైసెన్సులు మంజూరు చేసిందన్నారు. అయితే సుమారు 2000వ సంవత్సరం నుంచి లైసెన్స్‌లు రెన్యూవల్ చేయక నిలుపుదల చేశారని పేర్కొన్నారు. ఈ జీవో వలన అనేక మంది రోడ్డున పడే ప్రమాదముందని ఆవేదన వ్యక్తం చేశారు. అందువలన ప్రభుత్వం న్యాయం చేయాలని, లేకుంటే ఆందోళన బాట తప్పదని పేర్కొన్నారు. కార్యక్రమంలో దస్తావేజు లేఖరులు, స్టాంప్ వెండర్స్, డీటీపీ ఆపరేటర్లు ఎన్వీ కామేశ్వరరావు, బలగ శ్రీనివాసరావు, భువన్‌మోహన్, కుమార్, కింతలి రమణ, రామకృష్ణ, బాడాన గోవింద్, అన్నెపు సీతారాం, బలగ రామకృష్ణ, అల్లు రాజారావు, శ్రీనివాస మహాపాత్రో, చింతనిప్పుల అప్పలరాజు, పొందర రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


