శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): యూట్యూబర్ ప్రశ్న రావణ్‌పై ఉపా చట్టం కింద కేసు పెట్టడం అప్రజాస్వామికమని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు బొత్స సంతోష్, టౌన్ కన్వీనర్ వై.వేణులు అన్నారు. నగరంలోని రామలక్ష్మణ కూడలి వద్ద ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం సోమవారం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రశ్న రావణ్‌పై తక్షణమే కేసు ఉపసహరించుకోవాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే జైల్లో పెడతామనేవిధంగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం ఇలాంటి చర్యలకు దిగడం దుర్మార్గమని మండిపడ్డారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇతరులను ప్రశ్నించవచ్చు గానీ, ఆయనను ఎవరూ ప్రశ్నించకూడదనే ధోరణి సరికాదన్నారు. ఆయనను విమర్శించేవారిని జైలుకు పంపడం దారుణమన్నారు. ఒక వ్యక్తిపై ఒకే అంశంలో అన్ని కేసులు పెట్టడం కక్ష సాధింపు కాదా అని ప్రశ్నించారు. ప్రశ్న రావణ్‌పై ఉపా కేసును తక్షణమే ఉపసంహరించేలా సీఎం చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు అన్నాజీ, హేమంత్, శశి, రామకృష్ణ పాల్గొన్నారు.


