● మందసలో చారిత్రక కట్టడాల కూల్చివేత
● తీవ్రంగా వ్యతిరేకించిన స్థానికులు
మందస: వందల ఏళ్ల నాటి ఆనవాళ్లు, అంతకు ముందు నాటి కట్టడాలు.. వాటి గురించి అపురూప కథలు.. ఊరితో పెనవేసుకుపోయిన గాథలు.. ఏ గ్రామానికై నా ఇలాంటి చారిత్రక సంపద ఉంటే కంటికి రెప్పలా కాపాడుకుంటారు. ఊరి గతానికి సంబంధించిన జ్ఞాపకాలను అపురూపంగా దాచుకుంటారు. కానీ జిల్లాలోని చారిత్రక గ్రామాల్లో ఒకటైన మందసలో అందుకు వ్యతిరేకంగా జరుగుతోంది. ఇక్కడ గోపాలసాగర్ ప్రాంతంలో అష్టశంభు లక్ష్మణేశ్వర స్వామి ఆలయం ఎదురుగా ఓ పురాతన మండపం ఉండేది. ఈ ఇటుక కట్టడంపై శాసనాలు ఉండేవి. ఇక్కడే జైన తీర్థంకరుడి విగ్రహం కూడా ఉంది. చిల్డ్రన్ పార్క్ ఏర్పాటు పేరుతో ఈ పురాతన మండపాన్ని కూలదోశారు. స్థానికులు ఎంతగా వ్య తిరేకత తెలిపినా వినకుండా కట్టడాన్ని కాలగర్భంలో కలిపేశారు. అభివృద్ధిని తాము ఎప్పుడూ వ్యతిరేకించలేదని, కానీ చరిత్రను, సంప్రదాయాన్ని, భక్తుల భావాలను గౌరవిస్తూ అభివృద్ధి జరగాలని స్థానికులు కోరినా వినకుండా కట్టడాలను కూల్చేశారు.
శివాలయానికి వెళ్లే మార్గం కూడా ఇదే కావడంతో ఆదివారం అందరూ ఆ మండపం వద్దకు వచ్చి వ్య తిరేకత తెలిపారు. కార్యక్రమంలో మామిడి కోదండ, శ్రీనివాస్ పాడి, భూపతి, కంచి బెహరా, సంతోష్ గయా, పూర్ణచంద్ర, నిరంజన్ బెహరా, తిరుపతి బెహరా, బాడ సూరి, పద్మనాభం, గంగాదర బెహరా, సునీల్, కృష్ణ బెహరా సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
విధ్వంసం వద్దు..
మందస కేవలం గ్రామం కాదు. ఎన్నో ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం. ఇక్కడ ప్రతి రాయి, ప్రతి మండపం, ప్రతి ఆలయం ఓ కథ చెబుతుంది. మాకు అభివృద్ధి కావాలి. కానీ దాని కోసం ఇలా చరిత్రను ధ్వంసం చేయకూడదు. పార్కును మరో అనుకూల ప్రదేశానికి మార్చితే బాగుంటుంది.
– శ్రీనివాస్ పాడి, సామాజిక కార్యకర్త, మందస
మండపం కట్టాల్సిందే..
మండపాన్ని మళ్లీ యథాతథంగా నిర్మించాలి. ఈ మండపంపై ఓ శిలాశాసనం ఉండేది. బ్రాహ్మీ లిపిలో ఉన్న ఆ శాసనం చారిత్రకంగా ఎంతో విలువైనది. అది మా ప్రాంత చరిత్రను చెప్పే అరుదైన ఆధారం. అలాంటి విలువైన శాసనాన్ని, మండపాన్ని నిర్లక్ష్యం చేయడం సరికాదు. – మామిడి కోదండ,
పురాతన కట్టడాల పరిరక్షణ కమిటీ కన్వీనర్


