తోటి డ్రైవరే చంపేశాడు | - | Sakshi
Sakshi News home page

తోటి డ్రైవరే చంపేశాడు

Jul 6 2026 1:46 AM | Updated on Jul 6 2026 1:46 AM

● హత్యగా తేలిన అనుమానాస్పద మృతి కేసు

● వివరాలు వెల్లడించిన డీఎస్పీ లక్ష్మణరావు

టెక్కలి రూరల్‌: గత నెల 26వ తేదీన కోటబొమ్మా ళి మండలం కుజ్జిపేట గ్రామం దాలిచెరువు వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని కోటబొమ్మాళి పోలీసులు గుర్తించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆ కేసు కు సంబంధించి ఆదివారం టెక్కలి డీఎస్పీ డి.లక్ష్మణరావు కోటబొమ్మాళిలో విలేకరులకు వివరాలు వెల్లడించారు. మృతుడిని ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా కోటివాడ గ్రామానికి చెందిన బాపూజీ స్వైన్‌ (40)గా గుర్తించామని డీఎస్పీ తెలిపారు. డీఎస్పీ తెలిపిన వివరాలు ప్రకారం..

ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా బిపులింగి గ్రామానికి చెందిన లారీ ఓనర్‌ హరికృష్ణ చౌదరి వద్ద కేదార్‌దాస్‌ అనే వ్యక్తి డ్రైవర్‌గా పనిచేస్తుండే వాడు. అయితే ఆ వ్యక్తి ఎప్పటికప్పుడు తన లారీ లోని ఆయిల్‌ తీసి అమ్మేస్తున్నాడనే విషయం తె లుసుకున్న బాపూజీ స్వైన్‌ లారీ యజమానికి హరికృష్ణ చౌదరికి తెలిపాడు. దీంతో ఆ యజమాని డ్రైవర్‌ను పనిలో నుంచి తొలగించాడు. దీనికి బాపూజీ స్వైన్‌ కారణమని కేదార్‌దాస్‌ అతనిపై కక్ష పెట్టుకున్నాడు.

ఆరు నెలలు కిందట బాపూజీ స్వైన్‌ను యజమాని హరికృష్ణ చౌదరి డ్రైవర్‌గా పనిలో చేర్చుకున్నాడు. గత నెల 25వ తేదీన బాపూజీ విపులింగి గ్రామం నుంచి అట్టల లోడుతో బొబ్బిలి బయల్దేరాడు. కేదార్‌ దాస్‌ను కూడా తనతో రమ్మని చెప్పగా అతడిని చంపేందుకు ఇదే సరైన సమయం అని భావించిన కేదార్‌ దాస్‌ తనతో కలసి బయలు దేరాడు. అనంతరం బరంపురంలో కేదార్‌ దాస్‌ బాపూజీకి అధికంగా మద్యం తాగించి క్యాబిన్‌లో పడుకోమని చెప్పి తాను డ్రైవింగ్‌ చేశాడు. ఎన్‌హెచ్‌–16 నుంచి ఎచ్చెర్ల వరకు వెళ్లి మళ్లీ వెనక్కి తిప్పి కోటబొమ్మాళి మండలం హరిశ్చంద్రాపురం రైల్వే గేటు ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి దాటిన తర్వాత కుజ్జిపేటకు వెళ్లే రోడ్డు పక్కన లారీ ఆపి మద్యం మత్తులో ఉన్న బాపూజీ ముఖంపై బలంగా గుద్ది మెడలో ఉన్న తువ్వాలుతో ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. అనంతరం ఆ మృతదేహాన్ని లారీ దించి రోడ్డు పక్కగా ఉన్న దాలిచెరువు వద్ద పడేశాడు. అనంతరం లారీలో ఉన్న అట్టలను రూ.45,600 కి అమ్మేశాడు. అనంతరం లారీని నందిగాం మండ లం గోలంత్ర గ్రామం సమీపంలో ఆపేసి పరారయ్యాడు. స్థానిక ఎస్‌ఐ వి.సత్యనారాయణ నేతృత్వంలో టెక్కలి, నందిగాం, సంతబొమ్మాళి పోలీసులు 10 రోజులు పాటు గాలించి ఈ నెల 5వ తేదీన లారీ యజమాని హరికృష్ణ చౌదరి సహాయంతో ముద్దాయి కేదార్‌ దాస్‌ను నందిగాం మండలం కొత్తఅగ్రహారం వద్ద గల ఒక స్క్రాప్‌ కొట్టు వద్ద గుర్తించి అదుపులో తీసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. మృతుడి భార్య ప్రభాస్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement