జలుమూరు: ఎస్‌ఐఆర్‌లో భాగంగా ఓట్లు డిజిటలైజేషన్ శతశాతం పూర్తి చేయాలని ఎన్నికల అడిషనల్ సీఈవో ఎ.వెంకటేశ్వరరావు సూచించారు. మండలంలో శ్రీముఖలింగంలోని 1, 2, 3వ బూత్‌లను ఆదివారం పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లాలో 62 శాతం డిజిటలైజేషన్ పూర్తవ్వగా.. నరసన్నపేట నియోజకవర్గంలో 72 శాతం పూర్తి చేసి ముందంజలో ఉందన్నారు. జలుమూరు మండలం 73 శాతం పూర్తి అయిందన్నారు. తప్పులు లేకుండా మండల స్థాయి అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు. కచ్చితమైన ఓటర్ల జాబితా సిద్ధం కావాలన్నారు. తొలుత శ్రీముఖలింగేశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు స్వామివారి శేష వస్త్రాలు, తీర్థప్రసాదాలు అందించారు. ఈఆర్‌వో జయదేవి, తహసీల్దార్ జెన్ని రామారావు, సిబ్బంది పాల్గొన్నారు.


