టెక్కలి రూరల్: మండలంలోని లింగాలవలస పంచాయతీ పరిధి బలరాంపురం గ్రామ సమీపంలో ఆదివారం ఆర్టీసీ బస్సుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. పాతపట్నం నుంచి టెక్కలి వైపు వస్తున్న టెక్కలి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బలరాంపురం గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో పక్కనే ఉన్న బురదలో దిగబడి ఒక పక్కకు ఒరిగిపోయింది. దీంతో బస్సులోని ప్రయాణికులు అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అయితే బస్సు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. టెక్కలి నుంచి తెంబూరు వరకు రోడ్డు చాలా చిన్నది కావడంతో తరచూ ఈ రహదారిపై ఏదో ఒక ప్రమాదం జరుగుతోందని, వారం రోజులు క్రితం లింగలవలస సమీపంలో ఒక ఇసుక లోడుతో వెళ్తున్న టిప్పర్ అదుపుతప్పి సమీప పొలంలో పడిపోయిందని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి ప్రమాదాలు అరికట్టేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


