విద్యార్థి ఆకలి కేక | - | Sakshi
Sakshi News home page

విద్యార్థి ఆకలి కేక

Feb 10 2026 8:08 AM | Updated on Feb 10 2026 8:08 AM

విద్య

విద్యార్థి ఆకలి కేక

● పదో తరగతి విద్యార్థులకు ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక తరగతులు

● అల్పాహారం ఇవ్వని వైనం

● పైసా విదల్చని ప్రభుత్వం

● నీరసించిపోతున్న విద్యార్థులు

వంద రోజుల

ప్రణాళిక..

పదిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి.. వంద రోజుల ప్రణాళిక పాటించాలి.. ఉదయమంతా స్కూల్‌లోనే ఉండాలి.. అత్యధిక మార్కులు తెచ్చి తీరాలి.. విద్యాశాఖకు ఇచ్చిన లక్ష్యాలివి. కానీ ఈ లక్ష్య సాధనలో పిల్లలు పడుతున్న యాతన సర్కారు కంటికి కనిపించడం లేదు. పిల్లలు నీరసించిపోతారేమో.. కేవలం మధ్యాహ్న భోజనంతో పది గంటల పాటు ఎలా ఉంటారో.. అల్పాహారమైనా ఇద్దాం.. వంటి మంచి ఆలోచన ఒక్కటి కూడా ప్రభుత్వం చేయడం లేదు. ఫలితంగా పిల్లలు పొద్దుపోయే వేళకు నీరసించి ఇంటికి చేరుకుంటున్నారు. ఇది పరీక్షలపై ప్రభావం చూపుతుందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇచ్ఛాపురం రూరల్‌/ శ్రీకాకుళం:

ప్రభుత్వ పాఠశాలల్లోని పదో తరగతి విద్యార్థులను వంద రోజుల ప్రణాళిక నరకయాతనకు గురిచేస్తోంది. ఈ ప్రణాళిక ప్రకారం పిల్లలు ఉదయం 8 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్తే సాయంత్రం 6 గంటల వరకు స్కూల్‌లోనే ఉండాలి. కానీ ఈ ప్రత్యేక తరగతుల నిర్వహణలో విద్యార్థులు నీరసించిపోతున్నారు. కనీసం స్నాక్స్‌ ఇచ్చే ప్రయత్నం కూడా చేయకపోవడంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అల్పాహారం కోసం ప్రభుత్వం పైసా విదల్చకపోవడంతో పిల్లలు ఇబ్బంది పడుతూనే చదువుకోవాల్సి వస్తోంది.

జిల్లాలో 410 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 21,284 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. వచ్చే నెల 16 నుంచి ప్రారంభించనున్న పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో ఎలాగైనా వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని ఉన్నతాధికారు లు ఒత్తిడి తెస్తున్నారు. ఉపాధ్యాయులు కూడా అదే స్థాయిలో ఉదయం 8 గంటల నుంచి, సాయంత్రం 6 గంటల వరకూ ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు.

నీరసించిపోతున్న విద్యార్థులు

వసతి గృహాల సౌకర్యం ఉన్న కేజీబీవీ, ఏపీ మోడల్‌ హైస్కూల్‌, గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థులకు ఉదయం, సాయంత్రం సమయాల్లో ఆయా పాఠశాల యాజమాన్యం స్నాక్స్‌ సదుపాయం కల్పిస్తోంది. అయితే ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చదివే పదో తరగతి విద్యార్థులకు మాత్రం ఈ సౌకర్యం లేకపోవడంతో ప్రత్యేక తరగతుల్లో నీరసించిపోతున్నా రు. కొంత మంది విద్యార్థులు ఇంటి వద్ద నుంచి తెస్తున్న స్నాక్స్‌ సరిపోవడం లేదు. దీంతో చాలా మంది పిల్లలు ఇంటికి వచ్చేటప్పటికి నీరసించి పోతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు.

దాతలపైనే ఆధారం

పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతుల సమయంలో పౌష్టికాహారాన్ని అందించేందుకు గ్రామా ల్లోని దాతలు, స్వచ్ఛంద సంస్థలను ఆశ్రయిస్తున్నా రు ఉపాధ్యాయులు. గతంలో దాతలు ముందుకు రాని చోట్ల ఆయా పాఠశాలల్లోనే ఉపాధ్యాయులే కొంత సొమ్ము వేసుకొని విద్యార్థులకు అల్పాహారాన్ని అందజేశారు. పదో తరగతి పరీక్షలు దగ్గర పడుతున్న సమయంలో ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లి దండ్రులు కోరుతున్నారు.

స్టడీ మెటీరియల్‌ సరఫరా చేయని ప్రభుత్వం

టెన్త్‌ విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌ పంపిణీ చేయడం పరిపాటిగా వస్తోంది. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఈ ఏడాది మెటీరియల్‌ ఇవ్వలేదు. ఈ మెటీరియల్‌ తయారీకి ఐదు కోట్ల రూపాయలు లోపే ఖర్చవుతుందని ఉపాధ్యాయ సంఘం నేతలు చెబుతున్నారు. విద్యార్థులకు ఉపయోగపడే స్టడీ మెటీరియల్‌ సరఫరా చేయకుండా మానసిక ఒత్తిడికి గురయ్యేలా ప్రణాళికలు చేయడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.

నీరసంగా ఉంటోంది

పదో తరగతి ప్రత్యేక తరగతుల్లో ఎక్కువ సమయం పాఠశాల ఆ వరణలో ఉంటున్నాం. అల్పాహారం లేకపోవడంతో చాలా ఇబ్బందిగా ఉంటుంది. అల్పాహారం అందిస్తే బాగుంటుంది, లేకుంటే నీరసం వస్తోంది.

– జె.జాను, పదో తరగతి విద్యార్థిని, డొంకూరు

దాతలు చేయూతనందిస్తే..

ప్రత్యేక తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు అల్పాహారం అందజేసేందుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు మంజూరు కావడం లేదు. దాతలు స్పందించి చేయూతనందిస్తే అల్పాహారం అందించవచ్చు. – నరేంద్రనాథ్‌ పట్నాయక్‌,

ఇంచార్జీ హెచ్‌ఎం, కొళిగాం హైస్కూల్‌, ఇచ్ఛాపురం

విద్యార్థులకు స్నాక్స్‌ అందించాలి

ప్రభుత్వ, జిల్లా పరిషత్‌ పాఠశాలల్లో పబ్లిక్‌ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు ప్రభుత్వం రెండు పూటలా స్నాక్స్‌ అందించాలి. ఏపీ మోడల్‌ స్కూల్స్‌లోని పది విద్యార్థులకు స్నాక్స్‌ అందించేందుకు రూ.2,600 అందిస్తున్నారు. అయితే ప్రభుత్వ, పంచాయతీరాజ్‌, మున్సిపల్‌, ట్రైబల్‌ తదితర ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లోని విద్యార్థులను విస్మరించడం తగదు.

– తమ్మినేని చందనరావు, ప్రధాన కార్యదర్శి, స్కూల్‌ టీచర్స్‌ అసోసియేషన్‌, శ్రీకాకుళం

విద్యార్థి ఆకలి కేక 1
1/3

విద్యార్థి ఆకలి కేక

విద్యార్థి ఆకలి కేక 2
2/3

విద్యార్థి ఆకలి కేక

విద్యార్థి ఆకలి కేక 3
3/3

విద్యార్థి ఆకలి కేక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement