గురువుల మెడపై ఆటోమేషన్ కత్తి
● టెన్త్ పరీక్షలకు రాష్ట్రస్థాయి నుంచి ఇన్విజిలేషన్ బాధ్యతలు
● ఆరోగ్యం, కుటుంబ పరిస్థితులకు అతీతంగా విధులు
● దూర ప్రాంతాల్లో నియమించే అవకాశం
● ఆందోళన బాట పట్టాలని ఉపాధ్యాయుల యోచన
శ్రీకాకుళం: చంద్రబాబు ప్రభుత్వం బాధ్యతలు స్వీ కరించిన తర్వాత ప్రభుత్వ ఉపాధ్యాయులపై అదనపు భారాలు మోపుతోంది. తాజాగా పదో తరగతి పరీక్షలకు ఇన్విజిలేషన్ బాధ్యతల విషయంలో మరింత కఠిన నిర్ణయం తీసుకుంది. ఏటా పదో తరగతి ఇన్విజిలేషన్ బాధ్యతలు జిల్లా స్థాయిలో విద్యాశాఖ అధికారుల ద్వారా చేపట్టడం పరిపాటి. ఈ సారి అలా కా కుండా ఆటోమేషన్ విధానంతో రాష్ట్రస్థాయి నుంచి ఇన్విజిలేషన్ నియామకాలు జరపాలని రాష్ట్ర అధికారులు నిశ్చయించి జిల్లాల నుంచి ఉపాధ్యాయుల సీనియారిటీ తదితర వివరాలను తీసుకున్నారు. ఆటోమేషన్ విధానం ద్వారా ఇన్విజిలేషన్ బాధ్యతలు కేటాయిస్తే దీర్ఘ అనారోగ్యాలతో బాధపడుతున్న వారు, కుటుంబ సమస్యలతో ఉన్నవారికి సైతం ఇన్విజిలేషన్ బాధ్యతలు పడే అవకాశాలు ఉంటాయి. అలాగే సుదూర ప్రాంతాల్లో ఇన్విజిలేషన్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. ఇలాంటి విధానం పూర్తి అసంబద్ధమని ఉపాధ్యాయ సంఘాలు రాష్ట్ర అధికారులకు చెబుతున్నా వారు ఏమీ పట్టించుకోకుండా ఇదే విధానాన్ని అవలంబించాలని కసరత్తు చేస్తుండడంతో జిల్లాల్లో కూడా ఆందోళన బాట పట్టాలని ఉపాధ్యాయులు యోచిస్తున్నారు.


