చెలరేగుతున్న చోరులు
కిక్కిరిసిన బస్సులు..
● ఆర్టీసీ బస్సుల్లో చేతివాటం చూపుతున్న దొంగలు ● ఆదివారం నరసన్నపేట కాంప్లెక్స్‌లో ఇద్దరు పర్సుల చోరీ
నరసన్నపేట: నరసన్నపేట ఆర్టీసీ బస్టాండ్‌లో ఆదివారం ఉదయం 10.15 సమయంలో విశాఖ వెళ్లేందుకు బస్సు వచ్చి ఆగింది. గంట నుంచి బస్సు కోసం ఎదురు చూస్తున్న జమ్ముకు చెందిన నలుగురు మహిళలు బస్సు ఎక్కేందుకు ప్రయత్నించారు. ఒకేసారి పదుల సంఖ్యలో ప్రయాణికులు బస్సు ఎక్కేందుకు రావడంతో వీరు మాత్రం లోపలికి వెళ్లలేకపోయారు. కొద్ది సమయం తరువాత బ్యాగుల్లో ఉన్న వస్తువులు సరిచూసుకోగా పర్సులు కనిపించలేదు. దీంతో ఆర్టీసీ ఎస్‌ఎం వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో తానేమీ చేయలేనని, మీరే తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పడంతో మహిళలు ఆందోళన చెందారు. ఉచిత బస్సు అని వస్తే ఇలా పర్సులు పోతున్నాయని లబోదిబోమన్నారు. తన పర్సులో వెయ్యి రూపాయలు, ఆధార్‌కార్డు ఉన్నాయని ఒక మహిళ చెప్పగా.. మొబైల్ ఫోనుతో పాటు ఆధార్ కార్డు, ఏటీఎం కార్డు పోగొట్టుకున్నట్లు మరో మహిళ వాపోయారు.
నిత్యం ఇదే తంతు..
నరసన్నపేట ఆర్టీసీ బస్టాండ్‌లో మహిళల వస్తువులు, పర్సులు తరచూ చోరీకి గురవుతున్నాయి. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడంతో ఆక్యుపెన్సీ బాగా పెరిగింది. దీనికి తగ్గట్టుగా ఆర్టీసీ బస్టాండ్‌లలో భద్రతా ఏర్పాట్లు లేకపోవడంతో మహిళలు నష్టపోతున్నారు. ప్రయాణికుల మాదిరిగా దొంగలు రద్దీలోకి చొరబడి చేతివాటం చూపుతున్నారు. అయితే ఈ చోరీల విషయం పోలీసుల వరకూ వెళ్లడం లేదు. ఇదే అదునుగా దొంగలు చెలరేగిపోతున్నారు.
సీసీ కెమెరాలు ఎక్కడ..?
ప్రయాణికుల (మహిళా) రద్దీ బాగా పెరిగిన నేపథ్యంలో ఆర్టీసీ బస్టాండ్‌ల్లో విధిగా నిఘా పెంచాలని స్థానికులు కోరుతున్నారు. సీసీ కెమెరాలు అమర్చాలని, భద్రతా చర్యలు పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు. జిల్లాలో ప్రముఖ వ్యాపార కేంద్రం కావడం, నరసన్నపేటకు ఆనుకొని పరిసర గ్రామాలు అధికంగా ఉండటంతో నిత్యం బస్టాండ్ రద్దీగా ఉంటోంది. ఈ పరిస్థితుల్లో ఆర్టీసీ యాజమాన్యం తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
బస్టాండ్‌లలో ప్రయాణికుల తాకిడి అధికంగా ఉంటోంది. బస్సులు ఎక్కేటప్పుడు కొందరు చేతివాటం చూపించవచ్చు. ముఖ్యంగా మహిళలు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. బంగారు ఆభరణాల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. గడిచిన రెండు రోజుల నుంచీ నరసన్నపేట బస్టాండ్ వద్ద నిఘా పెంచాం.
– బలివాడ గణేష్, ఎస్సై, నరసన్నపేట
చెలరేగుతున్న చోరులు


