ఆదర్శ విప్లవకారుడు గుణవంతు
పలాస: ఉద్దానం ప్రాంతంలో ఆదర్శ విప్లవకారుడు రాజాం గుణవంతు అని పలువురు వక్తలు కొనియాడారు. పలాస మండలం బొడ్డపాడు గ్రామానికి చెందిన రాజాం గుణవంతు ఇటీవల అనారోగ్యంతో మృతిచెందడంతో శనివారం సంతాప సభ నిర్వహించారు. బొడ్డపాడు యర్రయ్య అధ్యక్షతన జరిగి న ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ గుణవంతు నాటి శ్రీకాకుళం గిరిజన రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొని జైలు జీవితం అనుభవించారని, పీపుల్స్ వార్ పార్టీ నాయకత్వాన ఉద్దానం ప్రాంతంలో జరిగిన సముద్రం తీర ప్రాంత భూములు పంపిణీలోను, సారా వ్యతిరేక పోరాటంలో, జీడి రైతాంగ గిట్టుబాటు ధర ఉద్యమంలో పాల్గొన్నట్లు గుర్తు చేశారు. కార్యక్రమంలో వివిధ ప్రజాసంఘాల నాయకులు దాసరి శ్రీరాములు, తామాడ త్రిలోచన రావు, కిక్కర ఢిల్లీరావు, బొడ్డు సింహాద్రి, కోత ధర్మారావు, ప్రభాకర్, బొడ్డు దుష్యంతు, మద్దిల ధర్మారావు, సాలిన వీరాస్వామి, మెట్టూరు వీరాస్వా మి, పోతనపల్లి కుసుమ, నైగాపు గంగాధర్, బొడ్డు సింహాచలం తదితరులు పాల్గొన్నారు.


