స్కేటింగ్ పోటీల్లో స్వర్ణం
వజ్రపుకొత్తూరు రూరల్: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో నివాసముంటున్న ఐ. శివశంకర్ అనే విద్యార్థి రెండు రోజుల క్రితం ఇండోనేషియాలో జరిగిన స్కేటింగ్ చాంపియన్ షిప్–2026 పోటీల్లో బంగారు పతకం సాధించాడు. ఓవైపు చదువులో రాణిస్తూ.. మరో వైపు స్కేటింగ్ పట్ల ఆసక్తి చూపుతూ జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటుతున్నాడు. వజ్రపుకొత్తూరు మండలం గరుడబద్రలోని శ్రీ గాయత్రీ విద్యాలయంలో 10వ తరగతి చదువుతున్న శివశంకర్‌ను శుక్రవారం ప్రిన్సిపాల్ టి.అర్జున్ చక్రవర్తి, ఉపాధ్యాయులు అభినందించారు. భవిష్యత్‌లో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అకాంక్షించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.


