నిఘానీడలో కేజీబీవీలు
శ్రీకాకుళం: జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో అత్యాధునిక సాంకేతికత కలిగిన సీసీ కెమెరాలు అమర్చారు. జిల్లాలో 25 కేజీబీవీలో ఉండగా సుమారు 7000 మంది విద్యార్థినులు 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్నారు. ఇటీవల కాలంలో కేజీబీవీలో కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరుగుతుండటంతో విద్యార్థినుల భద్రతకు పెద్దపీట వేయాలని ఈ చర్యలు తీసుకున్నారు. ఒక్కో కేజీబీవీలో 9 ఏసీ కెమెరాలను అమర్చారు. ఇవి మనిషి కదలికలను బట్టి 360 డిగ్రీల కోణంలో తిరుగుతూ పర్యవేక్షణ జరుపుతాయి. కేజీబీవీలో జరిగే రాకపోకలన్నీ రికార్డవుతాయి. బోధన, బోధనేతర సిబ్బంది పనితీరు, ఆహార పదార్థాలు వండటం, వీటికి సంబంధించిన వస్తువుల వినియోగంతో పాటు మరెన్నో పర్యవేక్షించేందుకు అవకాశం ఉంటుంది. ఈ కెమెరాలు జిల్లా అధికారి కార్యాలయంతో పాటు రాష్ట్ర అధికారుల కార్యాలయం, జిల్లా సమగ్ర శిక్ష అధికారి కార్యాలయానికి అనుసంధానమై ఉండటంతో అక్కడి నుంచి కూడా అన్ని కేజీబీవీలను పర్యవేక్షించే అవకాశాలు ఉంటాయి.
కేజీబీవీలో బాలికల భద్రత కోసం అత్యాధునిక సీసీ కెమెరాలు అమర్చాం. దీని ద్వారా విద్యార్థుల పర్యవేక్షణ కాకుండా సిబ్బంది పనితీరును జిల్లా స్థాయి నుంచే కాకుండా రాష్ట్ర స్థాయి వరకు పర్యవేక్షించే వీలుంటుంది.
– వేణుగోపాలరావు, ఏపీసీ, సమగ్రశిక్ష
అత్యాధునిక సీసీ కెమెరాల ఏర్పాటు
అవాంఛనీయ ఘటనలు
అరికట్టేందుకు చర్యలు


