పీఏసీఎస్ భవనంలో తాత్కాలిక కోర్టు
ఆమదాలవలస: ఆమదాలవలస పట్టణంలో నూతనంగా నిర్మాణం చేపట్టిన కృష్ణాపురం వ్యవసాయ పరపతి సంఘం భవనంలో తాత్కాలికంగా కోర్టు నిర్వహణకు జిల్లా కలెక్టర్ అనుమతులు అందించారు. శుక్రవారం కలెక్టర్ ఉత్తర్వులు, జిల్లా జడ్జి ఆదేశాల మేరకు భవనాన్ని న్యాయవాదుల సమక్షంలో కోర్టు సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. కార్యక్రమంలో బార్ అసోషియేషన్ అధ్యక్షుడు అన్నెపు సత్యనారాయణ, మాజీ అధ్యక్షులు కె.విజయలక్ష్మిభాయి, సీనియర్ న్యాయవాదులు పి.వి.నరసింహులు, తమ్మినేని అన్నంనాయుడు, కె.త్రినాధరావు, దానేటి రామ్మోహన్‌రావు, గోవిందరావు, విజయ్, బి.మోహన్‌రావు, అప్పలనాయుడు, కోర్టు సూపరింటెండెంట్ బషీర్, సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ వివాదం..
ఆమదాలవలసలో ప్రస్తుతం ఉన్న కోర్టు భవనాలు శిథిలావస్థకు చేరిన నేపథ్యంలో కొత్త భవనం నిర్మించే వరకు తాత్కాలికంగా కోర్టు నిర్వహణకు పీఏసీఎస్ భవనం అందించాలని కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే సమయంలో అద్దె భవనంలో నడుస్తున్న కృష్ణాపురం పీఏసీఎస్‌ను కొత్త భవనంలోకి మార్చేందుకు ప్రయత్నాలు జరగడంతో వివాదం చెలరేగింది. ఈ క్రమంలోనే న్యాయవాదులు కలెక్టర్ ఉత్తర్వులతో రెండు రోజుల కిందట ఈ భవనం వద్దకు పరిశీలనకు వచ్చారు. ఈ సమయంలో డీసీసీబీ అధ్యక్షుడు, పీఏసీఎస్ అధ్యక్షులు, సిబ్బంది చేరుకొని రైతుల డబ్బులతో నిర్మాణం చేశామని, భవనం అందించేందుకు రైతులతో సమావేశం ఏర్పాటు చేసి పరిశీలిస్తామని చెప్పడంతో కోర్టు సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే న్యాయవాదులపై కొందరు దురుసుగా మాట్లాడటంతో కోర్టు ఇన్‌చార్జి సూపరింటెండెంట్ సాయిరాం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఇటువంటి నాటకీయ పరిణామాల మధ్య న్యాయవాదులు సంబంధిత భవనాన్ని స్వాధీనం చేసుకుని కొత్తగా తాళాలు వేసి బోర్డును ఏర్పాటు చేయడం గమనార్హం.


