8 కిలోల గంజాయితో వ్యక్తి అరెస్టు
సోంపేట: కొర్లాం జాతీయ రహదారి వద్ద ఎనిమిది కిలోల గంజాయితో ఓ వ్యక్తిని బారువ ఎస్‌ఐ హరిబాబునాయుడు అరెస్టు చేసినట్లు సోంపేట సీఐ బి.మంగరాజు తెలిపారు. సోంపేట సర్కిల్ కార్యాలయంలో గురువారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా ముత్తగుడా గ్రామానికి చెందిన సుశాంత్ గమాంగో బుధవారం సాయంత్రం కొర్లాం జాతీయ రహదారి వద్ద పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. వెంటనే సిబ్బంది వెంబడించి అదుపులోకి తీసుకుని బ్యాగులు పరిశీలించారు. అందులో 8 కిలోలు బరువున్న 4 గంజాయి ప్యాకెట్లు గుర్దించారు. గంజాయితో పాటు ఫోన్, రూ.650 నగదు స్వాధీనం చేసుకున్నారు. గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో బారువ ఎస్‌ఐ హరిబాబునాయుడు, సిబ్బంది పాల్గొన్నారు.
రెండు కేజీల గంజాయి స్వాధీనం
శ్రీకాకుళం రూరల్: సింగుపురం పంచాయతీ సరిహద్దు ప్రాంతంలో నర్సింగ్ కళాశాల ఆవరణలో గంజాయి పీలుస్తున్న నలుగురు యువకులను శ్రీకాకుళం రూరల్ పోలీసులు గురువారం సాయంత్రం పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి రెండు కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. టౌన్ సీఐ పైడపునాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


