‘ప్రారంభించని పనుల వివరాలు ఇవ్వండి’
అరసవల్లి: జిల్లాలో పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖల్లో 15వ ఆర్థిక సంఘం నిధులతో పాటు జెడ్పీ సాధారణ నిధుల నుంచి గత నాలుగేళ్లలో కోట్లాది రూపాయ లతో మంజూరు చేసిన పనుల్లో ఇంకా ప్రారంభం కాని పనుల వివరాలను తక్షణమే సిద్ధం చేయాలని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పిరియా విజయ ఆదేశించారు. ఈ మేరకు గురువారం తన బంగ్లాలో సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంకా పనులు మొదలుపెట్టని వివరాలను తదుపరి చర్యల నిమిత్తం జెడ్పీ సీఈఓకు లిఖితపూర్వకంగా అధికారులు అందజేయా లని ఆదేశించారు. నిధులున్నా ఇంతవరకు ఎందుకు పనులు ప్రారంభించలేదో ఇంజినీరింగ్ అధికారులు గమనించాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ డి.సత్యనారాయణ, శ్రీకాకుళం, పాలకొండ, టెక్కలి డివిజనల్ అధికారులు పాల్గొన్నారు.
108 సిబ్బంది సమ్మె బాట
శ్రీకాకుళం పాతబస్టాండ్: గత ఏడాది కాంట్రాక్టర్–ఉద్యోగుల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం పెంచిన జీతాలు, పీఎఫ్ కటింగ్ బాధ్యతలు నెరవేర్చడం లేని, పలు సార్లు కాంట్రాక్టర్‌ను కోరినా ఫలితం లేదని అందుకే సమ్మెకు సిద్ధమవుతున్నామని 108 ఉద్యోగుల సంఘం ప్రతినిధులు గురువారం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌కు తెలిపారు. 108లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని విన్నవించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు గురువారం సమ్మె నోటీసు అందజేశారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో ఆ సంఘం నాయకులు విజయమోహన్ తదితరులు ఉన్నారు.
‘శిక్షణ సద్వినియోగం చేసుకోండి’
సారవకోట: నూతన తరానికి అవసరమైన గృహోపకరణాలు తయారు చేయాలని కేంద్ర హస్తకళల అభివృద్ధి కమిటీ రీజనల్ డైరెక్టర్ లక్ష్మణరావు సూచించారు. గురువారం ఆయన మండలంలోని బుడితి గ్రామంలో ఇటీవల లేపాక్షి ద్వారా శిక్షణ ఇచ్చి తయారు చేసిన గృహోపకరణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లేపాక్షి ద్వారా తా ము శిక్షణ ఇచ్చామని, ఆ శిక్షణలో నేర్చుకున్న వస్తువుల తయారు చేసి లేపాక్షి ద్వారా విక్రయించాలని కోరారు. అలాగే కేంద్ర హస్తకళల విభాగంగా ద్వారా దేశంలో నిర్వహించే వస్తు ప్రదర్శనలకు బుడితి కంచు, ఇత్తడి వస్తువులతో పాటు నూతనంగా కొత్త తరానికి అవసరమైన వస్తువులను తయారు చేసి ఆయా వస్తు ప్రదర్శనలకు తీసుకెళ్లాలన్నారు. ఈ సందర్భంగా ఆయన కింతాడ జనర్ధానరావు, అద్దాల రామకృష్ణలు తయారు చేసిన వస్తువులను పరిశీలించి పలు సూచనలిచ్చారు. తాము ఇటీవల ఇచ్చిన శిక్షణ ద్వారా కొంతమేర వస్తువుల తయారీ నేర్చుకున్నామని, మరికొన్ని మెలకువలు నేర్చుకునేందుకు మరింత శిక్షణ ఇవ్వాలన్నారు. ఆయనతో పాటు లేపాక్షి మేనేజర్ కార్తీక్ కుమార్, అకౌంటెంట్ మురళీ తదితరులు ఉన్నారు.
అధికారుల నిర్లక్ష్యం.. అన్నదాతకు నష్టం
ఆమదాలవలస రూరల్: అధికారుల నిర్లక్ష్యం అన్నదాతలను ముంచేసింది. కాలం కాని కా లంలో నారాయణపురం ఎడమ కాలువ ద్వా రా సాగునీరు అధికంగా విడిచిపెట్టంతో అనేక గ్రామాల్లో అపరాల పంటకు నష్టం వాటిల్లిందని అన్నదాతలు గగ్గోలు పెడుతున్నారు. మండలంలోని కొత్తవలస, చీమలవలస, కొర్లకోట, నారిపేట, కలివరం, కనుగులవలస తదితర ప్రాంతాల్లో అపరాలు నీటమునిగాయి. అధికారులు చేసిన పనికి తాము పంటను కూడా కోల్పోవాల్సి వస్తుందని పలువురు కంటతడిపెడున్నారు.
‘ప్రారంభించని పనుల వివరాలు ఇవ్వండి’
‘ప్రారంభించని పనుల వివరాలు ఇవ్వండి’


