పండగ సరే.. పైసలేవీ?
అరసవల్లి రథసప్తమి ఏర్పాట్ల ఖర్చులకు నిధుల లేమి చేతులెత్తేసిన శ్రీకాకుళం నగరపాలక సంస్థ అధికారులు! గత ఏడాది ఖర్చు చేసిన రూ.8 కోట్లు తిరిగి చెల్లించని ప్రభుత్వం రాష్ట్ర పండగలుగా ప్రకటిస్తూ నిధులు ఊసెత్తని ప్రజాప్రతినిధులు
శ్రీకాకుళం :
రాష్ట్ర ప్రభుత్వం అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో రథసప్తమి వేడుకలను ఈ నెల 19 నుంచి 25 వరకు ఏడు రోజులపాటు రాష్ట్ర పండుగగా జరపాలని నిశ్చయించింది. అయితే ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు నిధుల కొరత వేధిస్తోంది. గత ఏడాది నిధులు సమకూర్చిన నగర పాలక సంస్థ అధికారులు ఈసారి మాత్రం చేతులెత్తేసినట్లు తెలిసింది. రథసప్తమి ఏర్పాట్లకు సంబంధించి పలు శాఖల అధికారులతో జిల్లా ఉన్నతాధికారులు జరిపిన సమీక్షలో పలు వివరాలు వెలుగుచూశాయి.
అప్పులే మిగిలే..
గత ఏడాది మూడు రోజులపాటు రథసప్తమి వేడుకలను రాష్ట్ర పండుగగా జరిపేందుకు ప్రభుత్వం ప్రకటనలు చేసింది. ఈ మేరకు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర, కేంద్ర మంత్రులు అధికారులను ఆదేశించారు. ముందుగా నగరపాలక సంస్థ ఖర్చు చేస్తే దానిని ప్రభుత్వం నుంచి వెనక్కు ఇప్పి స్తామని భరోసా ఇవ్వడంతో, జిల్లా ఉన్నతాధికారులతో పాటు నగరపాలక సంస్థ అధికారులు వెనుకా ముందు చూడకుండా ఎనిమిది కోట్ల రూపాయల ను ఖర్చు చేశారు. ఈ మొత్తంలో ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి రాలేదు. నగరపాలక సంస్థ ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతుండడంతో తమకు ఉన్న సౌలభ్యాన్ని వినియోగించుకొని రాష్ట్ర ప్రణాళిక విభాగం నుంచి రూ.నాలుగు కోట్లు వడ్డీ లేని రుణాన్ని తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది కోట్లను వెనక్కి చెల్లిస్తే అందులో నుంచి నాలుగు కోట్లు తీర్చవచ్చని భావించగా, ఆ నిధులు రాకపోగా నాలుగు కోట్లు అప్పు మిగిలింది. ప్రస్తుతం నగరపాలక సంస్థ రూ.36 కోట్ల మేర లోటు బడ్జెట్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.
దేవదాయశాఖ బకాయి రూ.65 లక్షలు
దేవాదాయశాఖ నగరపాలక సంస్థకు రూ.65 లక్షల బకాయి పడింది. గత ఏడాది రథసప్తమి సందర్భంగా దేవాదాయ శాఖ కొన్ని పనులు చేపట్టేందుకు నిధులు లేకపోవడంతో జిల్లా కలెక్టర్, నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి అనుమతితో ఆ పనులను కూడా నగరపాలక సంస్థ జరిపింది. ఆ మొత్తాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ ద్వారా వెనక్కి వచ్చేలా చూస్తామని అప్పట్లో హామీ ఇచ్చిన కొందరు ప్రజాప్రతినిధులు ఇప్పుడు ఆ ఊసే ఎత్తకపోవడంతో ఈ విషయం కూడా అగమ్యగోచరంగా మారి నగరపాలక సంస్థను ఆర్థిక ఇబ్బందుల్లో పడేసింది.
రిజిస్ట్రేషన్ శాఖ బకాయిలు రూ.25 కోట్లు..
నగరపాలక సంస్థకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కూడా రూ.25 కోట్లు వరకు బకాయిపడినట్లు నగరపాలక సంస్థ ఉన్నతాధికారులకు అందజేసిన నివేదిక ప్రకారం తెలుస్తోంది. నగరంలో ఇల్లు, స్థలాలకు సంబంధించిన క్రయ విక్రయాలు జరిగితే దీని ద్వారా రిజిస్ట్రేషన్ శాఖకు సమకూరిన ఆదాయంలో కొంత వాటాను నగరపాలక సంస్థకు ఇవ్వాల్సి ఉంటుంది. కొన్నేళ్లుగా చెల్లింపులు జరగకపోవడంతో ఈ మొత్తం రూ.25 కోట్లకు చేరినట్లు సమాచారం.


