మా ప్రాంతంలో విధ్వంసం సహించబోం
వజ్రపుకొత్తూరు రూరల్: పచ్చని ఉద్దానంలో విధ్వంసాన్ని సహించబోమని కార్గో ఎయిర్ పోర్టు బాధితులు ముక్తకంఠంతో హెచ్చరించారు. మండలంలో గల మోట్టూరు పంచాయతీ పరిధిలో గల బర్రివానిపేటలో కార్గో ఎయిర్ పోర్టు వ్యతిరేక కమిటీ ఆధ్వర్యంలో గురువారం ‘మా ఊరు మా భూమి’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాధితులు ముక్తకంఠంతో మా భూములే మాకు ముద్దు..మా ప్రాంతంలో విధ్వంసం వద్దు అంటూ నినాదాలు చేశారు. ఏళ్ల తరబడి తమకు తల్లిలా ఉన్న ఈ భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. అనంతరం పోరాట కమిటీ అధ్యక్ష కార్యదర్శి కొమర వాసు, జోగి అప్పారావులు మాట్లాడుతూ తరతరాలుగా భూములను నమ్ముకొని జీవనోపాధి సాగిస్తున్న రైతులు నేడు కార్గో ఎయిర్ పోర్టు నిర్మాణం చేయాలన్న ప్రభుత్వ ఆలోచనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని అన్నారు. దీనిలో భాగంగానే బాధిత ప్రాంతాలలో దశల వారిగా అవగాహన, పోరాట కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. చివరిగా బాధితులు అంతా కలిసి ఉద్దాన ప్రాంతాన్ని కాపాడుకునేందుకు ప్రతిజ్జ చేశారు. కార్యక్రమంలో పోరాట కమిటీ నాయకులు, బాధితులు గుంటు లోకనాథం, బర్రి కుర్మానాయకులు, గుల్ల ఈశ్వరరావు, బర్రి సురేష్, జోగి కామరాజు, ఉమాపతి, రామస్వామీ తదితరులు ఉన్నారు.


