రాష్ట్రంలో ‘రెడ్‌బుక్’ రాజ్యాంగం అమలు
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా సమస్యలపై ప్రశ్నిస్తున్న విద్యార్థి, యువజన సంఘాల నాయకులపై అక్రమ కేసులు బనాయించడాన్ని, రౌడీషీట్లు ఓపెన్ చేయడాన్ని యువజన, విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు శ్రీకాకుళం నగరంలో దాసరి క్రాంతిభవన్‌లో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు మార్పు ఫృథ్వీ, ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొన్న శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పూడి కిరణ్ కుమార్, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు సాయికుమార్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు కె.చందు, విద్యార్థి విభాగం నాయకులు విజయ్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు బొత్స సంతోష్, నిరుద్యోగ పోరాట సమితి నాయకులు డి.సూర్యంలు మాట్లాడారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు, విద్యార్థులకు ఇచ్చిన ఉద్యోగ క్యాలెండర్, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి హామీలను అమలు చేయాలని కోరడం నేరమా అని ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేష్‌ల సొంత ఆస్తులు అడగడం లేదని, ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోమంటే అక్రమంగా జైలుకు పంపడం దుర్మార్గమన్నారు. విశాఖపట్నంలో విద్యార్థి నాయకులపై పెట్టిన అక్రమ రౌడీషీట్లను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. నారా లోకేష్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ‘మా ప్రభుత్వం వస్తే యువజన విద్యార్థి సంఘాల నాయకులపై కేసులుండవు, మీ సమస్యలు నేరుగా నా దృష్టికి తీసుకురండి’ అని చెప్పి ఇప్పుడు ‘రెడ్ బుక్’ రాజ్యాంగాన్ని అమలు చేయ డం సరికాదన్నారు. అణచివేతతో ఉద్యమాలను ఆపలేరన్నారు. డిమాండ్లు నెరవేర్చని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నిరసనల ద్వారా ప్రభుత్వానికి గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో యువజన, విద్యార్థి సంఘాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


