పశువుల అక్రమ రవాణా అడ్డగింత
నరసన్నపేట: జాతీయ రహదారిపై లారీలో హైదరాబాద్‌కు అక్రమంగా తరలిస్తున్న 45 పశువులను హైవే పెట్రోలింగ్ పోలీసు సిబ్బంది గురువా రం పట్టుకున్నారు. అనంతరం నరసన్నపేట పోలీసులకు వాహనాన్ని అప్పగించారు. బరంపురం నుంచి వీటిని తీసుకొస్తున్నారు. లోపల పశువులను ఎక్కించి పైన క్లాత్ కట్టి రవాణా చేస్తున్నారు. హైవే పోలీసులకు అనుమానం వచ్చి గొట్టిపల్లి వద్ద వాహనం నిలిపి తనిఖీలు చేయగా గుట్టు రట్టు అయ్యింది. వాహనంలో 15 ఆవులు, 20 ఎడ్లు, 10 దూడలు ఉన్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి మూగజీవాలను కొత్తవలస గోశాలకు తరలించామని ఎస్సై శేఖరరావు తెలిపారు.
మందస: బాలిగాం సమీపంలో జాతీయ రహదారి పై ఇచ్ఛాపురం వైపు నుంచి పలాస వైపు పవువుల తో వెళుతున్న నాలుగు వాహనాలను పోలీసులు పట్టుకున్నారు. వాహనాలను సీజ్ చేసి 17 పశువులను గోశాలకు తరలించినట్లు మందస ఎస్‌ఐ కె.కృష్ణప్రసాద్ తెలిపారు.
మెళియాపుట్టి: ఒడిశా రాష్ట్రం పర్లాకిమిడి నుంచి టెక్కలి వైపు రెండు పశువులను వాహనంలో అక్రమంగా తరలిస్తుండగా గురువారం స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేశారు. పశువులను గోశాలకు తరలించారు.


