ఇచ్ఛాపురంలో వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేస్తాం
ఇచ్ఛాపురం/ఇచ్ఛాపురం రూరల్: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్ఛాపురం నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేస్తామని వైఎస్సార్‌సీపీ ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త సాడి శ్యామ్ ప్రసాద్‌రెడ్డి అన్నారు. నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టిన ఆయన పలువురు నాయకులను బుధవారం కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఇచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకుంటానని తెలియజేశారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా కార్యకర్తలతో కలిసి సమన్వయంతో పనిచేసి విజయం సాధించేందుకు కృషి చేస్తామన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం సాగిస్తామని, పార్టీ కార్యక్రమాలను విస్తతంగా చేపడతామని వెల్లడించారు. బూత్ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేస్తామని పేర్కొన్నారు. ఆయనతో పాటు పార్టీ రాష్ట్ర బీసీ విభాగం కార్యదర్శి నర్తు నరేంద్ర యాదవ్, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి సల్ల దేవరాజు, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు నర్తు ప్రేమ్‌కుమార్ యాదవ్, వైస్ ఎంపీపీ దున్న గురుమూర్తి, కౌన్సిలర్ బచ్చు జగన్, సర్పంచ్ దుక్క ధనలక్ష్మి, ఎంపీటీసీ నీలాపు జగదీష్, నర్తు భానోజీ, నీలాపు చంద్రయ్య తదితరులు ఉన్నారు.


