ఆటలకు చోటేది..? | - | Sakshi
Sakshi News home page

ఆటలకు చోటేది..?

Jan 8 2026 6:27 AM | Updated on Jan 8 2026 6:27 AM

ఆటలకు చోటేది..?

ఆటలకు చోటేది..?

వ్యాయామం పీరియడ్‌పై ప్రైవేటు

పాఠశాలల్లో మల్లగుల్లాలు

95 శాతం పాఠశాలల్లో మైదానాలు

లేని వైనం

10 శాతం పాఠశాలల్లోనే డ్రిల్‌ మాస్టర్లు

అమలు సాధ్యమవ్వక ఇండోర్‌ గేమ్స్‌ నిర్వహించాలని మౌఖిక ఆదేశాలు

ప్రభుత్వ ఆదేశాలు వాస్తవమే

శ్రీకాకుళం: విద్యార్థులకు మానసిక ఆందోళన ఉండకూడదని, ఆరోగ్యం సరిగా ఉండాలంటే వ్యాయామం తప్పనిసరి అని నిపుణులు సూచిస్తున్న విషయం తెలిసిందే. దీని ఆధారంగా చేసుకొని పాఠశాలల్లో ప్రతిరోజు ఒక వ్యాయామ పీరియడ్‌ ఉండేలా రూపకల్పన చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇవి అమలవుతున్నాయి. అయితే ప్రైవేట్‌ పాఠశాలల్లో మాత్రం దీనిని అమలు చేయకపోగా నీట్‌, జేఈఈ, ఐఐటీ, ఒలింపియాడ్‌ ఇలా రకరకాల పేర్లు పెడుతూ విద్యార్థులను ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు పాఠశాలల్లో ఉంచి ఒత్తిడికి గురి చేస్తున్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల మానసిక, శారీరక ఆరోగ్య పరిస్థితిని ఆలోచించకుండా చదువే ముఖ్యమని ప్రైవేట్‌ పాఠశాలలు తీసుకొస్తున్న ఒత్తిడికి లొంగుతున్నారు. ఈ కారణంగానే ప్రైవేట్‌ పాఠశాలల్లోని విద్యార్థులు ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పలు సర్వేలు తేటతెల్లం చేస్తున్నాయి. వీటిని పరిగణలోనికి తీసుకున్నారో.. మరే కారణంగానో తాజాగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల అమలుపై విద్యాశాఖ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.

వ్యాయామం కోసం పీరియడ్‌

ప్రభుత్వం ప్రైవేట్‌ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రతిరోజూ ఒక పీరియడ్‌ తప్పనిసరిగా వ్యాయామం కోసం కేటాయించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే జిల్లాలోని 95 శాతం ప్రైవేట్‌ పాఠశాలల్లో మైదానాలు లేవని విద్యాశాఖ అధికారులకు తెలియనిది కాదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతీ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో క్రీడా మైదానం తప్పనిసరి. అయితే ప్రైవేట్‌ పాఠశాలలకు అనుమతులు ఇచ్చినప్పుడు అప్పటి విద్యాశాఖ అధికారులు ఏ కారణంగానో ఉదాసీనంగా వ్యవహరించి మైదానాలు లేకపోయినా అనుమతులు జారీ చేసేశారు. జిల్లాలో ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలలు 400 వరకు ఉండగా, గుర్తింపు లేని పాఠశాలలు మరో 100 వరకు ఉన్నాయి. వీటిలో దాదాపుగా 95 శాతం పాఠశాలల్లో క్రీడా మైదానాలే లేవు.

అపార్ట్‌మెంట్లలో పాఠశాలలు

చాలావరకు ప్రైవేట్‌ పాఠశాలలు అపార్ట్‌మెంట్ల తరహా భవనాల్లో కొనసాగుతున్నాయి. అధికారులు వీటికి అనుమతులు జారీ చేసినప్పుడు సెల్లార్‌ను మైదానంగా చూపించేశారు. వాస్తవానికి ఒక పది శాతం పాఠశాలలు మినహా మిగిలిన ప్రైవేట్‌ పాఠశాలల్లో వ్యాయామ ఉపాధ్యాయులే లేరనడంలో అతిశయోక్తి లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు అమలు చేయడం కష్టతరమే. దీనిని గుర్తించిన విద్యాశాఖ అధికారులు ప్రైవేట్‌ పాఠశాలల్లో ఉదయం ప్రార్థన సమయంలో యోగ, సాయంత్రం వేళ ఇండోర్‌ గేమ్స్‌ నిర్వహించాలని మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర అధికారుల నుంచి కూడా జిల్లా శాఖకు ఇదే విధమైన మౌఖిక ఆదేశాలు అందడం గమనార్హం. ఇదిలా ఉండగా చాలా ప్రైవేట్‌ పాఠశాలల్లో ఇండోర్‌ గేమ్స్‌ నిర్వహించే సౌకర్యం కూడా లేదు. వీటిని నిర్వహించాలంటే విశాలమైన హాలు ఉండాలి. ఇటువంటి పరిస్థితులు దాదాపుగా ఏ పాఠశాలలోనూ లేవు. చాలా పాఠశాలలు ఇరుకు గదుల్లోనే తరగతులను నిర్వహిస్తున్నాయి. దీనిపై అనేక సందర్భాల్లో విద్యార్థి సంఘాలు ఆందోళన చేసిన సందర్భాలు కూడా లేకపోలేదు. ఈ లెక్కన ప్రభుత్వం వ్యాయామ పీరియడ్‌పై జారీ చేసిన ఉత్తర్వులు అమలు చేయడం దాదాపుగా సాధ్యం కాదనే చెప్పాలి. దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

ప్రైవేట్‌ పాఠశాలల్లో ప్రతీ తరగతికి ఒక పీరియడ్‌ వ్యాయామం కోసం కేటాయించాలని ఆదేశాలు రావడం వాస్తవమే. ఉదయం వేళ యోగ, సాయంత్రం ఇండోర్‌ గేమ్స్‌ ఆడించాలని ఆదేశాలు వచ్చాయి. మైదానాలు చాలా పాఠశాలల్లో లేకపోవడం కూడా నిజమే. ఇండోర్‌ గేమ్స్‌ నిర్వహించాలని సూచిస్తున్నాం.

– ఎ.రవిబాబు, జిల్లా విద్యాశాఖ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement