సర్పంచ్‌ల నిరసన
సరుబుజ్జిలి: గ్రామ పంచాయతీల్లోని నిధుల వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించి, అభివృద్ధికి విఘాతం కలిగించడం ఎంతవరకు సమంజసమని పలువురు సర్పంచ్‌లు ప్రశ్నించారు. పంచాయతీ నిధుల ఖర్చు విషయంలో ఈ ప్రభుత్వం తీసుకుంటున్న నిరంకు విధానాలపై మండల కేంద్రంలో బుధవారం పలు పంచాయతీల సర్పంచ్‌లంతా కలిసి నిరసన తెలిపారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ పాలనకు పట్టుగొమ్మల్లాంటి పంచాయతీలను నిర్వీర్యం చేసే దిశగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ నిధుల వినియోగంపై జారీ చేసిన జీవో వలన పారిశుద్ధ్యం, తాగునీరు, గ్రామ సచివాలయాల నిర్వహణ విషయంలో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వెల్లడించారు. పంచాయతీల్లో చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు మంజూరు కాలేదని, ఇలాంటి తరుణంలో ఆంక్షలు విధించడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విధించిన జీవోను తక్షణమే వెనుక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తెగిపడిన విద్యుత్ వైర్
టెక్కలి రూరల్: మండలంలోని రావివలస గ్రామంలో ఉన్న అల్లాయిస్ పరిశ్రమకు చెందిన విద్యుత్ వైరు బుధవారం తెగిపడి రెండు పందులు మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. పరిశ్రమకు సమీపంలో ఉన్న వంశధార కాలువ వద్దనున్న విద్యుత్ స్తంభం నుంచి వైరు తెగి కిందనున్న పందులపై పడిపోయింది. దీంతో అక్కడికక్కడే రెండు పందులు మృతి చెందాయి. దీనిపై అప్రమత్తమైన గ్రామస్తులు పరిశ్రమ యాజమాన్యానికి సమాచారం అందించారు. అనంతరం గ్రామస్తులు చనిపోయిన పందులను పరిశ్రమ ముందు వేసి నిరసన తెలిపారు. విద్యుత్ వైర్లు మనుషులపై పడి ఉంటే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.
మన భూములను కాపాడుకుందాం
మందస: మన ఊరు.. మన భూములను కాపాడుకుందామని, ఈ క్రమంలో ఎవరు ఎటువంటి ప్రలోభాలకు గురిచేసినా లొంగవద్దని మందస మండలం తెలగ గంగువాడ గ్రామస్తులు బుధవారం ప్రతిజ్ఞ చేశారు. స్థానిక సామాజిక భవనం వద్ద కార్గో ఎయిర్‌పోర్టు వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్షుడు కొమర వాసు ఆధ్వర్యంలో రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. గ్రామపెద్ద చిత్త కూర్మారావు మాట్లాడుతూ కార్గో ఎయిర్ పోర్టు వ్యతిరేక పోరాట కమిటీ పిలుపు మేరకు ఉద్యమంలో అందరూ భాగస్వాములం అవుతామన్నారు.
సర్పంచ్‌ల నిరసన
సర్పంచ్‌ల నిరసన


