హక్కుల సాధనకు ఆల్ ఇండియా జేఏసీ
శ్రీకాకుళం: ఉపాధ్యాయుల హక్కుల సాధనే లక్ష్యంగా దేశవ్యాప్తంగా ఏడు జాతీయ ఉపాధ్యాయ సంఘాలు కలిసి ఆల్ ఇండియా జాయింట్ యాక్షన్ కమిటీ ఫర్ టీచర్స్ ఆర్గనైజేషన్‌ను ఏర్పాటు చేసినట్లు ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు పేడాడ ప్రభాకరరావు తెలిపారు. దీనికి సంబంధించి శ్రీకాకుళం నగరంలో పోస్టర్‌ను బుధవారం విడుదల చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న విద్యారంగ వ్యతిరేక విధానాలపై జాతీయస్థాయిలో ఉద్యమాన్ని చేపట్టనున్నట్లు చెప్పారు. ఈ ఉద్యమంలో భాగంగా ఫిబ్రవరి 5వ తేదీన చలో ఢిల్లీ, మార్చ్ టు పార్లమెంట్ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. జాతీయ పోరాటంలో ఎస్టీయూ అనుబంధ సంఘాలు ఏఐఎస్టీఎఫ్, ఏఐఎఫ్‌ఈటీవోలు భాగస్వాములుగా ఉన్నాయని, ఉపాధ్యాయ సమస్యలను జాతీయ స్థాయిలో బలంగా వినిపించేందుకు ఈ ఉద్యమం కీలకమని సంఘం రాష్ట్ర కార్యదర్శి పడాల తమ్మి నాయుడు పేర్కొన్నారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గురువు శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ.. మన రాష్ట్రంలో ఇప్పటికే ప్రతీ జిల్లాలో వందల సంఖ్యలో పాఠశాలలను మూసివేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని మండిపడ్డారు. విద్యార్థులు తక్కువగా ఉన్న పాఠశాలలను మౌఖిక ఆదేశాలతో విలీనం చేయడం దుస్సాహసమని చెప్పారు. ఈ జాతీయ ఉద్యమానికి ఫిబ్రవరి 5న జరిగే మార్చ్ టు పార్లమెంట్ ద్వారా నాంది పలుకుతున్నట్లు సీనియర్ నాయకులు ఎస్వీ రమణమూర్తి అన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు కె.తేజేశ్వరరావు, సూర్యారావు, రామారావు, రామచంద్ర, రామకృష్ణ, రాజేశ్వరరావు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


